భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Grandhi Mallikarjuna Rao Interesting Comments On Ysr And Cm Jagan | Sakshi
Sakshi News home page

భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, May 3 2023 4:51 PM | Last Updated on Wed, May 3 2023 7:00 PM

Grandhi Mallikarjuna Rao Interesting Comments On Ysr And Cm Jagan - Sakshi

సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ, సీఎం జగన్‌ విజన్, లీడర్‌షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టిని ఆయన అభినందించారు.

జీఎంఆర్‌ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
అందరికీ నమస్కారం.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రపంచంలో చాలా ఎయిర్‌పోర్ట్‌లు కట్టాను. కానీ మా సొంత ఊరు రాజాం. వైజాగ్‌ రెండో ఊరు. నా ఫస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫౌండేషన్‌ వేశారు. ఆయనే సీఎంగా ఉండగానే ప్రారంభించారు.. రెండు మా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ ఇనాగ్యురేషన్‌కి కూడా వైఎస్సార్‌ వచ్చారు.. ఈ రోజున భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ ఆయన తనయుడు జగన్‌ తన అమృత హస్తాలతో శంకుస్ధాపన చేయడం, వారే మళ్లీ ఇనాగ్యురేట్‌ చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నాను.
చదవండి: అటు అదానీ డేటా సెంటర్‌.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు

సీఎం జగన్‌ విజన్, లీడర్‌షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పాలసీ, సీ పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల కనెక్టివిటీపై చేసిన పాలసీ, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం గారికి నా అభినందనలు. ఆ సమావేశం ఒక అద్భుతం. నేను కూడా అందులో భాగస్వామ్యం అయ్యాను. ప్రపంచంలో మాకిది 12వ ఎయిర్‌పోర్ట్.. హైదరాబాద్, గోవా తర్వాత మేం నిర్మిస్తున్న మూడో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్, ప్రపంచస్ధాయి ప్రమాణాలతో మేం నిర్మిస్తాం. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ చేసిన కొత్తలో 1999–2000 లో 7 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండగా, ఇప్పుడు 500కు చేరాయి.

దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఎకానమీనే మారిపోయింది. అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కూడా కడతాం.. ఇక్కడ కార్గో కూడా ఉండడం వల్ల రైతులకు, మత్స్యకారులకు, ఫార్మా ఇండస్ట్రీకి ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుంది.. ఇక్కడి సంస్కృతిని చూసి ఈ ఎయిర్‌పోర్ట్‌ డిజైన్‌ చేశాం. మేం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ తీసుకున్నప్పుడు అధ్వానంగా ఉండేది.. దానిని నెంబర్‌ వన్‌ ఎయిర్‌పోర్ట్‌గా మార్చాం.. అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను చేస్తాం, భగవంతుడు కూడా వర్షం రూపంలో మనల్ని దీవించారు.. నేను జీఎంఆర్‌ తరపున 36 నెలల్లో నెంబర్‌ వన్‌ ఎయిర్‌పోర్ట్‌ కడతానని హామీ ఇస్తున్నాను, మీరే మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

చిరకాల వాంఛ నెరవేరింది: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు
అందరికీ నమస్కారం, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ చిరకాల వాంఛ. గత ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ కావాలని ప్రజలందరినీ ఇబ్బంది పెడితే నాడు సీఎం జగన్‌ మన ప్రాంతానికి వచ్చి మన పక్షాన పోరాడి.. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని, 3 నుంచి 5 వేల ఎకరాలతో ఎయిర్‌పోర్ట్‌ కట్టవచ్చని మన తరుపున పోరాడారు. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగారి చొరవతో అందరికీ నష్టపరిహారం ఇచ్చి, కేసులు ఎత్తివేసి ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తున్నారు.

సీఎం మాట తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. గతంలో వైఎస్సార్‌ ఉన్నప్పుడు తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్‌ ఆవశ్యకత చెప్పగానే ఆయన మంజూరు చేశారు. చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు కూడా శంకుస్ధాపన చేస్తున్నారు. స్ధానికంగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గా ప్రకటించాలని.. మా ప్రాంత ప్రముఖులు కొమ్మూరు అప్పడుదొర, పెనుమత్స సాంబశివరాజు గారి పేర్లు పెట్టేందుకు అవకాశం ఉంటే పరిశీలించాలని కోరుతున్నాను.
చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్‌ మనీ వైట్‌గా ఎలా మారుతోంది? 

పాలకులు మంచి వారు అయితే ప్రజలు బాగుంటారు, ఆర్ధిక సమస్యలు ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్, సీఎంగా చిరకాలం సీఎంగా ఉంటే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. మల్లికార్జునరావు మన ప్రాంత వాసి. ఆయన సొంత ఊరు రాజాం కూడా విజయనగరం జిల్లాలో ఉంది. జీఎంఆర్‌ గారు కూడా ఇప్పుడు మా జిల్లా వాసే, ధన్యవాదాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement