మాలె ఎయిర్‌పోర్టును వదులుకోం | GMR ready to run Male airport, if allowed | Sakshi
Sakshi News home page

మాలె ఎయిర్‌పోర్టును వదులుకోం

Published Fri, Dec 20 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

మాలె ఎయిర్‌పోర్టును వదులుకోం

మాలె ఎయిర్‌పోర్టును వదులుకోం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివాదాస్పదమైన మాలె విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు సిద్ధమని జీఎంఆర్ గ్రూపు వెల్లడించింది. మాల్దీవుల ప్రభుత్వం తిరిగి తమను ఆహ్వానిస్తే విమానాశ్రయ నిర్వహణ చేపడతామని గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు స్పష్టం చేశారు. గురువారమిక్కడ టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాలె విమానాశ్రయం అభివృద్ధి, కొత్త టెర్మినల్ నిర్మాణం విషయంలో జీఎంఆర్ విజయవంతమైంది. రాజకీయ కారణాల వల్లే నిర్వహణ బాధ్యత నుంచి వైదొలిగాం. అక్కడి ప్రభుత్వం నుంచి 1.4 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ దాఖలు చేసిన మధ్యవర్తిత్వ కేసు సింగపూర్ కోర్టులో నడుస్తోంది’ అని చెప్పారు. 50 కోట్ల డాలర్లకుపైగా విలువైన మాలె కాంట్రాక్టును గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టును అకారణంగా రద్దు చేశారంటూ సింగపూర్ కోర్టును జీఎంఆర్ ఆశ్రయించింది.
 
 ‘ఇస్తాంబుల్’లో వాటా విక్రయించం..
 సబీహ గోక్సెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని మల్లికార్జునరావు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో ఉన్న వాటాను విక్రయించే ఆలోచన ఏదీ లేదని పేర్కొన్నారు. వాటాల నిర్వహణ తమ వ్యూహమని చెప్పారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపుకు 40%, మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు 20 శాతం, మిగిలిన వాటా లిమాక్ హోల్డింగ్స్‌కు ఉంది. రూ.40 వేల కోట్లకుపైగా రుణ భారంతో ఉన్న జీఎంఆర్, అప్పుల ను తగ్గించుకోవడానికి ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉన్న మొత్తం వాటాను విక్రయిస్తున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో చైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను భారత్‌లోగానీ, ఇతర దేశాల్లోగానీ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం దేశ, విదేశీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్నామని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టు చేజిక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సమ్మిట్‌లో మై హోమ్ గ్రూపు చైర్మన్ జె.రామేశ్వర్ రావు, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement