Male airport
-
136 మంది ప్రయాణికులు.. దారితప్పిన విమానం..!
సాక్షి, న్యూఢిల్లీ : పర్యవేక్షణా లోపం కారణంగా ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మాలే విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. 136 మంది ప్రయాణికులతో కూడిన ఎ-320 ఎయిరిండియా విమానం తిరువనంతపురం నుంచి మాల్దీవులకు బయల్దేరింది. మాలే విమనాశ్రయంలో దిగే క్రమంలో నిర్మాణంలో ఉన్న రన్‌వేపై ల్యాండ్ కావడంతో ఒక్కసారిగా విమానం టైర్లు తీవ్ర ఘర్షణకు గురయ్యాయని ఎయిరిండియా అధికారి వెల్లడించారు. టైర్లు మట్టిలో కూరుకుపోవడంతో విమానం ఆ పక్కనే ఉన్న పార్కింగ్ బే (వాహనాల పార్కింగ్)వైపు దూసుకెళ్లిందని తెలిపారు. అయితే, తప్పిదాన్ని గ్రహించిన పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో విమానం నిలిచిపోయిందని అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారి పేర్కొన్నారు. కాగా, ఘటనపై స్పందించిన డీజీసీఏ ఇద్దరు పైలట్లను తొలగించింది. విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. -
మాలే ఎయిర్ పోర్టు కేసులో జీఎంఆర్ కి అనుకూలంగా తీర్పు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలే ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహరం ఈ ఏడాది మూడో త్రైమాసికంలోగా వస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఎంఆర్ - యాక్సిస్ బ్యాంక్ కేసులో సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు జీఎంఆర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2010లో మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసే కాంట్రాక్టును 2012లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడాన్ని జీఎంఆర్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసినందుకు నష్టపరిహారానికి కోర్టును ఆశ్రయించగా వివాదం చివరకు ఆర్బిట్రేషన్‌కు చేరింది. ఫిబ్రవరి 23న సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినట్లు జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ఒకానొక దశలో 15 శాతం పెరిగిన షేరు చివరకు నాలుగు శాతం లాభంతో రూ. 11.65 వద్ద ముగిసింది. -
మాలె ఎయిర్‌పోర్టును వదులుకోం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివాదాస్పదమైన మాలె విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు సిద్ధమని జీఎంఆర్ గ్రూపు వెల్లడించింది. మాల్దీవుల ప్రభుత్వం తిరిగి తమను ఆహ్వానిస్తే విమానాశ్రయ నిర్వహణ చేపడతామని గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు స్పష్టం చేశారు. గురువారమిక్కడ టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాలె విమానాశ్రయం అభివృద్ధి, కొత్త టెర్మినల్ నిర్మాణం విషయంలో జీఎంఆర్ విజయవంతమైంది. రాజకీయ కారణాల వల్లే నిర్వహణ బాధ్యత నుంచి వైదొలిగాం. అక్కడి ప్రభుత్వం నుంచి 1.4 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ దాఖలు చేసిన మధ్యవర్తిత్వ కేసు సింగపూర్ కోర్టులో నడుస్తోంది’ అని చెప్పారు. 50 కోట్ల డాలర్లకుపైగా విలువైన మాలె కాంట్రాక్టును గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టును అకారణంగా రద్దు చేశారంటూ సింగపూర్ కోర్టును జీఎంఆర్ ఆశ్రయించింది. ‘ఇస్తాంబుల్’లో వాటా విక్రయించం.. సబీహ గోక్సెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని మల్లికార్జునరావు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో ఉన్న వాటాను విక్రయించే ఆలోచన ఏదీ లేదని పేర్కొన్నారు. వాటాల నిర్వహణ తమ వ్యూహమని చెప్పారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపుకు 40%, మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు 20 శాతం, మిగిలిన వాటా లిమాక్ హోల్డింగ్స్‌కు ఉంది. రూ.40 వేల కోట్లకుపైగా రుణ భారంతో ఉన్న జీఎంఆర్, అప్పుల ను తగ్గించుకోవడానికి ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉన్న మొత్తం వాటాను విక్రయిస్తున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో చైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను భారత్‌లోగానీ, ఇతర దేశాల్లోగానీ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం దేశ, విదేశీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్నామని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టు చేజిక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సమ్మిట్‌లో మై హోమ్ గ్రూపు చైర్మన్ జె.రామేశ్వర్ రావు, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు మాట్లాడారు.