గంటలో 44 రేషన్‌ కార్డులు మంజూరు | Granted 44 Ration Card Per Hour In AP | Sakshi
Sakshi News home page

గంటలో 44 రేషన్‌ కార్డులు మంజూరు

Published Tue, Oct 6 2020 5:39 AM | Last Updated on Tue, Oct 6 2020 7:53 AM

Granted 44 ration‌ cards per hour in AP - Sakshi

తుమ్మలకుంటలో రేషన్‌కార్డును అందిస్తున్న సిబ్బంది

సాక్షి, తిరుపతి రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తూ రికార్డు సృష్టిస్తోంది. రేషన్‌ కార్డుల నెలల కోసం తరబడి అందరి చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చేసింది. దరఖాస్తుదారులకు అర్హత ఉంటే నిమిషాల్లోనే కార్డు మంజూరవుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్‌ మండల తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది సోమవారం గంట వ్యవధిలో 44 రేషన్‌ కార్డులు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 51 మంది రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వీఆర్వో, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ స్థాయిల్లో మొత్తం ఆరు దశల్లో వీటిని పరిశీలించి 44 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. దీంతో కార్డులు మంజూరు చేశారు. దుర్గసముద్రం పంచాయతీలో దరఖాస్తు చేసుకున్న సంధ్యకు 20 నిమిషాల్లో, తుమ్మలగుంటలో అపర్ణకు 21 నిమిషాల్లో.. ఇలా 20 నిమిషాల నుంచి గంటలోపు మొత్తం 44 రేషన్‌ కార్డులు మంజూరు చేసినట్లు రూరల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా దరఖాస్తు చేసుకున్న గంటలోనే 44 రేషన్‌ కార్డులను మంజూరు చేసిన తహసీల్దారును, సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. (చదవండి: అరగంటలోనే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement