బతుకుదామని వస్తే చచ్చేంత పనైంది.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం
అన్నీ సమకూర్చుకోవడం కష్టమే
గతంలో వరద వస్తే ప్రభుత్వం ముందే చెప్పేది
ఇప్పుడు పట్టించుకున్న నాథుడే లేడు
ముంపు ప్రాంతాల్లో బాధితుల మనోవేదన
‘వానవస్తే.. వరద ముంచితే.. బతుకు తప్పిన వలస జీవులకు ఎంత నష్టం.. ఎంత నష్టం. అలుపన్నది ఎరుగక.. ఆకలన్నది తెలియక.. ఆయువునే పణంగా పెట్టి డొక్కలెండిన పేద జీవులకు ఎంత కష్టం.. ఎంత కష్టం..’ అన్నం తినే కంచం నుంచి కునుకుతీసే మంచం వరకు ప్రతి వస్తువునూ వరద ఎత్తుకుపోవడంతో వలస జీవుల బతుకులు దుర్భరంగా మారాయి. తడిసిన ఇళ్లల్లో ఉండలేక.. మరో చోటకు పోయే దారిలేక పేద బతుకులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో తమలో తామే రోదిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి బృందం : సొంతూరిలో ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని నగరానికి వలసొచ్చిన నిరుపేదల జీవితాల్లో బుడమేరు వరద పెద్ద గాయం చేసింది. ఐదారు రోజులపాటు వరద నీరు ఇళ్లలోనే తిష్టవేయడంతో తినే కంచం దగ్గర నుంచి పిల్లల పుస్తకాలు, యూనిఫామ్, టీవీ, ఫ్రిడ్జ్, బైక్ ఇలా ప్రతి ఒక్కటి పనికిరాకుండా పోయిన దుస్థితి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో తాము మళ్లీ ఇవన్నీ సమకూర్చుకుని కొత్తగా కాపురం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తీవ్ర ముంపునకు గురైన ప్రాంతాల్లో అధిక శాతం బాధితులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి బతుకుదెరువుకు విజయవాడకు వలస వచ్చినవారే. ఎవర్ని కదిలించినా ‘ఈ నగరాన్ని నమ్ముకుని ఏళ్ల తరబడి బతికిన మాకు ఇప్పుడు నరకప్రాయంగా మారింది. బెజవాడలో బతుకుదామని వచ్చాం.. ఇప్పుడు చావడానికే వచ్చామా అనిపిస్తోంది. నానా పాట్లుపడి సమకూర్చుకున్న సామగ్రి మొత్తం పోయింది.
సర్వం కోల్పోయి మా బతుకులు మళ్లీ పదేళ్ల వెనక్కు వెళ్లాయి’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తునారు. వలసజీవులు పడుతున్న మనోవేదన గుండెలను పిండేస్తోంది. గురువారం వరద ప్రాంతాల్లో పర్యటించిన ‘సాక్షి’ ప్రతినిధి బృందానికి వలస జీవులు తమ వెతలను వెళ్లబోసుకున్నారు.
మళ్లీ సామాన్లన్ని సమకూర్చుకోవాలి
వలస జీవులంతా అద్దెలు తక్కువ ఉంటాయని సింగ్‌నగర్, కృష్ణలంక, వైఎస్సార్ కాలనీ, రాజరాజేశ్వరిపేట వంటి ప్రాంతాల్లోనే ఉంటారు. కక్షగట్టిన వరద విపత్తు వారుంటున్న ప్రాంతాల్లో తీవ్ర నష్టం చేసింది. రోజువారీ పనికిపోతే వచ్చిన కొంత మొత్తంలోనే తినీతినక దాచుకున్న సొమ్ముతో కిస్తీల (ఈఎంఐ) రూపంలో సమకూర్చుకున్న మొబైల్ ఫోన్, టీవీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్యాస్ స్టవ్, బైక్ వంటివన్నీ ముంపు వల్ల పనికిరాకుండా పోయాయి.
ప్రస్తుత రోజుల్లో ఈ వస్తువులు లేకుండా సగటు జీవనం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆ వస్తువులన్నీ తిరిగి కొనేదెలా అనే మనోవేదన పేదలందరినీ తీవ్రంగా వేధిస్తోంది. టీవీ, మొబైల్ ఫోన్, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిడ్జి ఇలా ఇంట్లోకి నిత్యం అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేయడానికే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. బైక్ కూడా పనికిరాకుండా పోయినవారికి మరో రూ.లక్షకుపైనే భారం అవుతోంది.
రోజంతా పనికిపోతే రూ.500 వరకు సంపాదించే తాము మళ్లీ ఎన్నేళ్లు కష్టం చేస్తే అవన్నీ కొనుగోలు చేయడం సాధ్యపడుతుందని దిగులుపడుతున్నారు. ఇక జీవనాధారమైన ఆటోలు, రిక్షాలు, తోపుడు బండ్లు ధ్వంసమైన వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
నా ఇల్లు ఐదు రోజులుగా నీటిలోనే ఉంది
వడ్రంగి పని చేసుకుని బతుకుదామని పిల్లలను తీసుకుని 20 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చేశాం. నా భర్త, పిల్లలు కష్టపడి సంపాదించిన దాంతో రేకుల షెడ్డు వేసుకున్నాం. ఏటా మా ప్రాంతంలో వరద వచ్చేది. వరద వచ్చిన ప్రతిసారీ మేం పటమట చేపల మార్కెట్ సమీపంలోని స్కూల్‌కు వచ్చి తలదాచుకునేవాళ్లం.
ప్రభుత్వమో, దాతలో భోజనం పెట్టేవారు. వరద తగ్గగానే వెళ్లిపోయే వాళ్లం. గత ప్రభుత్వం కృష్ణా నదికి గోడ కట్టడంతో వరద సమస్య లేదు. ఇప్పుడు కూడా పల్లపు ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు, వర్షం నీటితో మా ఇల్లు మునిగిపోయింది. ఐదు రోజులుగా మా ఇల్లు నీటిలోనే ఉంది. కట్టుబట్టలతో బయటపడ్డాం. – నడకుదుటి లక్ష్మి, రోజువారీ కూలి
కట్టుబట్టలే మిగిలాయ్..
తెలంగాణలోని ఇల్లెందు నుంచి 30 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చాను. నేను, నా భార్య పద్మ పారిశుధ్య పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. వరదపై మాకు ముందస్తు హెచ్చరికలు చేసినవారు లేరు. ఊహించని ఉపద్రవం ముంచుకురాగా ప్రాణాలతో బయటపడ్డాం. ఇన్నేళ్లుగా కష్టపడి సమకూర్చుకున్న టీవీ, మంచం, సెల్‌ఫోన్, బట్టలు ఏ ఒక్కటీ మిగల్లేదు. అవన్నీ సమకూర్చుకోవాలంటే కనీసం రూ.70 వేలు కావాలి. నాకు అంత స్థోమత లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – భూక్యా శంకర్‌నాయక్, పారిశుధ్య కార్మికుడు
తినే కంచం నుంచి ఏమీ మిగల్లేదు
పాతికేళ్ల క్రితం విజయనగరం నుంచి విజయవాడకు వలస వచ్చాం. గతంలో వరద వస్తున్నప్పుడు ముందే ప్రభుత్వం హెచ్చరించేది. ఇంట్లో ఉన్న వస్తువులను ఆటోల్లో వేసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవాళ్లం. ఈ సారి వరద వస్తోందని మాకు ఏ ఒక్క అధికారి చెప్పిన పాపానపోలేదు. ఉప్పెనలా వచ్చిన వరద రేకుల షెడ్డును ముంచేసింది.
ప్రాణాలరచేత పట్టుకుని కుటుంబం అంతా బయటపడ్డాం. వరద తగ్గాక వెళ్లి చూస్తే ఇంట్లో ఏ ఒక్క వస్తువు మిగల్లేదు. మా అబ్బాయి బీటెక్, మా అమ్మాయి 10వ తరగతి చదువుతున్నారు. వాళ్ల పుస్తకాలు, యూనిఫామ్ బురదగొట్టుకుపోయాయి. తాపీపని చేస్తే రూ.800 ఇస్తారు. వచ్చే కూలితో ఇల్లు గడవడమే కష్టం. – జి.రామకృష్ణ, తాపీమేస్త్రి
ఆధార్ లేదు.. ఆధారం పోయింది
తెలంగాణ నుంచి వచ్చి విజయవాడలో 25 ఏళ్ల క్రితం స్థిరపడ్డాం. అనారోగ్యంతో మా అమ్మా నాన్న చనిపోయారు. నాలుగేళ్ల క్రితం నా భర్త, ఒక్కగానొక్క కూతుర్నీ కోల్పోయి ఒంటరినయ్యాను. కూలీనాలీ చేసుకుని బతుకుతున్నాను. కనీసం పింఛన్ కూడా రావట్లేదు. ఆధార్ కార్డు లేదని ప్రభుత్వం పింఛన్ ఇవ్వట్లేదు. ఆధార్ లేక.. ఆధారం లేక అవస్థలు పడుతున్న నాకు వరద నిలువ నీడకూడా లేకుండా చేసింది. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. – ఎలిశెట్టి సుజాత, ఒంటరి మహిళ
Comments
Please login to add a commentAdd a comment