సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘గుడివాడ అసెంబ్లీ సీటు నాదే. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా. ఇదే విషయాన్ని సార్‌కు నా మాటగా స్పష్టంగా చెప్పండి’ అని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పేయడంతో టీడీపీ రాష్ట అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించారు.
తాము అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి అన్నరీతిలో పరిస్థితులు తల్లకిందులు అవుతుండటంతో చంద్రబాబు దీర్ఘాలోచనల్లో పడినట్లు తెలిసింది. కింకర్తవ్యం... తాత్కాలిక మౌనమే శ్రేయస్కరమనే ముఖ్యుల అభిప్రాయాలను అంగీకరించిన ఆయన గుడివాడలో కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపేయాలని, మళ్లీ చెప్పేవరకు అటువైపు వెళ్లవద్దని వెనిగండ్ల రాముకు సూచించారనేది సమాచారం. తానిక హైదరాబాద్‌కు పరిమితమవ్వాలా లేక అమెరికాకు పయనమవ్వాలా అనే మీమాంసలో ఉన్న రాము ఆఖరు ప్రయత్నంగా తనను ప్రోత్సహిస్తున్న లోకే‹Ùను కలిసి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో సోమవారం ఒంగోలుకు వెళ్లారు.
పార్టీ వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... సుమారు నెల రోజులుగా గుడివాడ టికెట్ అంశంపై టీడీపీలో అంతర్గత చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)పై బలమైన అభ్యరి్థని రంగంలోకి దింపి ఎలాగైనా జెండా ఎగరేయాలనే యోచనతో ప్రవాసాంధ్రుడైన వెనిగండ్లను కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేష్ లు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా లోకేష్ ఆశీస్సులే రాముకు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తగ్గేదేలేదన్న రావి
మాజీ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడాలని, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు పురమాయించడంతో మూడు వారాల కిందట అచ్చెన్నాయుడు రావిని విజయవాడకు ఆహ్వానించారు. బాబు అభిప్రాయాలను రావి వద్ద ప్రస్తావించడం.. అందుకు ససేమిరా అనడంతో పాటు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి ఈమారు తగ్గేదేలేదన్నారనేది సమాచారం. ‘డబ్బుల కట్టలతో వచ్చిన వారికి టికెట్ ఇచ్చేస్తాం. వారు పోటీచేస్తారు. మీరు పక్కకు తప్పుకోండి. ఇంకేదైనా పదవి ఇస్తామంటే కుదరదు’ గతంలో కూడా ఇలాగే జరిగింది. ఈ పర్యాయం అంగీకరించేది లేదు. ఖర్చు పెట్టుకోలేరు అంటున్నారు. నా స్థాయిలో నేను ఖర్చుకు సిద్ధం. తక్కినది పార్టీ భరించాల్సిందే. ఇన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలను కొనసాగించింది ఎవరు? ఇవన్నీ పార్టీ నాయకత్వానికి తెలియదా? అని నిలదీయడంతో కంగుతినడం పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడి వంతైందని పారీ్టవర్గాలు అంటున్నాయి. తన అభిప్రాయాలన్నింటినీ అధినేతకు స్పష్టంగా వివరించాలనడంతో అచ్చెన్నాయుడు అదే చేశారనేది సమాచారం. మరో ప్రయత్నంగా రెండు వారాల కిందట మాజీమంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన కొల్లు రవీంద్రను గుడివాడలోని రావి వద్దకు అధిష్టానం రాయబారానికి పంపింది. అచ్చెన్నాయుడు వద్ద కన్నా ఇంకాస్త ఘాటుగానే స్వరం పెంచడంతో కొల్లు వెళ్లి రావి వైనాన్ని బాబుకు వివరించారని తెలిసింది.
వెనిగండ్లనే కావాలంటే..
మీరే చేసుకోండి గుడివాడ నుంచి వెనిగండ్లనే పోటీ చేయించాలనుకుంటే ఎన్నికలు కూడా మీరే చేసుకోండని, తాము దూరంగా ఉంటామని అధిష్టానానికి నియోజకవర్గంలోని పలువురు మండల ముఖ్య నాయకులు తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారితో పార్టీ మండల అధ్యక్షులు కూడా శ్రుతి కలపడం అధిష్టానాన్ని ఆలోచనల్లో పడేసినట్లయ్యింది.
రావికి దన్నుగా...
విజయవాడ లోక్‌సభ స్థానంతో పాటు ఉమ్మడి కృష్ణాలోని పలు నియోజకవర్గాల సీనియర్లకు టికెట్ ఉంటుందో, ఊడుతుందో అంతుబట్టడంలేదు. వెనిగండ్లలాంటి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు రంగంలోకి వస్తున్నారని, ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీచేస్తే ఎవరెవరి సీట్లకు ఎసరొస్తుందో దిక్కుతెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లుగా పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే ఎవరి స్థానాలను వారు కాపాడుకోవచ్చనే అంచనాకు వచ్చారని, ఆ దృష్ట్యానే రావి తన వాయిస్‌ను గట్టిగా వినిపించారంటున్నారు. ‘మాదగ్గర డబ్బులున్నాయి. మేం పోటీచేస్తాం. మీరు పక్కకు తప్పుకోండి’ అని వేషగాళ్ల మాదిరి ఎవరుపడితే వారొచ్చేస్తుంటే మనం ఎందుకు తప్పుకోవాలి. అవసరమైతే పిలువు గుడివాడకు వస్తా. నీకు అండగా నేను నిలుస్తా’ అని ఓ సీనియర్ నేత భుజం తట్టినందునే రావి అంత దన్నుగా ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment