
పేటెంట్ పొందిన పరికరంతో డాక్టర్ సూరత్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైద్యుడు రూపొందించిన వైద్య పరికరానికి పేటెంట్ లభించడం ఇదే మొదటిసారి..
Guntur Doctor Gets Patent For Plasma Therapy Kit: వైద్య రంగంలో పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను సొంతం చేసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సూరత్ అమర్‌నాథ్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్లేట్‌లెట్ థెరపీలో వినూత్నంగా రూపొందించిన వైద్య పరికరానికి ఈ పేటెంట్ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైద్యుడు రూపొందించిన వైద్య పరికరానికి పేటెంట్ లభించడం ఇదే మొదటిసారి. శనివారం గుంటూరు కొత్తపేటలోని డాక్టర్ అమర్ ఆర్థోపెడిక్ హాస్పటల్లో డాక్టర్ సూరత్ అమర్‌నాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో స్ఫూర్తి పొంది ప్లేట్‌లెట్ థెరపీ పరికరాన్ని రూపొందించినట్టు చెప్పారు. రోగి నుంచి రక్తాన్ని సేకరించి ఆ రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను వేరు చేసి.. ఆ రోగికి అవసరమైన చోట సిరంజితో ఎక్కించడాన్ని ప్లేట్‌లెట్ థెరపీ అంటారని, ప్రస్తుతం దీనికి రూ.6 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందన్నారు. అయితే తాను రూపొందించిన ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ పరికరం ఖరీదు కేవలం రూ.2 వేలు మాత్రమేనని డాక్టర్ సూరత్ అమర్‌నాథ్ వివరించారు.