
సాక్షి, గుంటూరు : దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపైన హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలన్ని ఆయన ప్రేరేపించాడని భావించాలా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయటం మంచిది కాదని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారని, విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉన్నారని, తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ఆయనను చూడలేదన్నారు. ఆయన్ను చంపితే మాకేం వస్తుందని, ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్
తెలుగుదేశం నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఇంత గొప్పగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు ఊహించలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ శవ రాజకీయాలు, దేవాలయాలపై దాడులు చేపిస్తోందన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగైదు హత్యలు జరిగాయని, అంటే వాటిని ఆయన చేయించాడా అని సూటిగా ప్రశ్నించారు. యరపతినేని నరేంద్ర హత్య కేసులో ముద్దాయి అన్న సంగతి మర్చిపోయాడా అని నిలదీశారు. కాగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment