సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
వైద్య సేవలు చేరువ
ఎఫ్‌డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్‌ను హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది.
అవయవ దానానికి ముందుకు రావాలి
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్‌లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం
ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment