విజయనగరం జిల్లా గోవిందపురంలో 20.3 సెంటీమీటర్ల వర్షం
నేడు ఒడిశాలోని పూరీ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం వాయవ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇప్పటికే కోస్తాంధ్రలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
వాయుగుండం ప్రభావంతో శనివారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం సాయంత్రానికి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల పాటు వర్షాలకు కొంత విరామం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 20 వరకు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.
విద్యాసంస్థలకు సెలవు
ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా శనివారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment