జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌కు హైకోర్టు ఘన వీడ్కోలు | High Court farewell to Justice Guhanathan Narender | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌కు హైకోర్టు ఘన వీడ్కోలు

Published Wed, Dec 25 2024 4:47 AM | Last Updated on Wed, Dec 25 2024 4:47 AM

High Court farewell to Justice Guhanathan Narender

న్యాయ వ్యవస్థకు ఆయన సేవలు వెలకట్టలేనివి 

లోక్‌ అదాలత్‌లను సమర్థవంతంగా నిర్వహింపజేశారు 

విజయవాడ వరదల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ 

ఘనంగా సన్మానించిన హైకోర్టు న్యాయవాదుల సంఘం

సాక్షి, అమరావతి: పదోన్నతిపై ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌కు హైకోర్టు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్‌ నరేందర్‌కు వీడ్కోలు ఇచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్‌ నరేందర్‌ వెలకట్టలేని సేవలు అందించారని కొనియాడారు. 

అనేక కేసుల్లో పలు కీలక తీర్పులిచ్చారని, పరిపాలనాపరంగా ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా లోక్‌ అదాలత్‌లు సమర్థంగా జరిగేలా కృషి చేశారన్నారు. లోక్‌ అదాలత్‌లలో లక్ష కేసులు పరిష్కారం కావడం వెనుక ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. విజయవాడలో వరదల తరువాత ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా కృషి చేశారని జస్టిస్‌ ఠాకూర్‌ తెలిపారు.

ప్రత్యేక ప్రతిభావంతులైన 62 మంది పిల్లలకు విని­కిడి యంత్రాలు అందజేసేందుకు కృషి చేశారన్నారు. అలాగే అంధులైన పిల్లలకు వై­ద్య పరీక్షలు చేయించి, ఇద్దరికి కంటి చూపు వచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆయన కృషి, సేవలు తనను ఎంతో ఆనందానికి గురి చేశాయని సీజే పేర్కొన్నారు. 

ఇక్కడ గడిపిన కాలం గుర్తుండిపోతుంది 
అనంతరం జస్టిస్‌ నరేందర్‌ మాట్లాడుతూ, హైకోర్టులో పనిచేసిన ఈ 14 నెలల కాలం తన జీవితాంతం గుర్తుండి పోతుందన్నారు. ఇక్కడి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తనపై ఎంతో ప్రేమ, అనురాగం చూపారన్నారు. పరిపాలనపరమైన నిర్ణయాల్లో తన ఆలోచనలను సీజే ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. ఇక్కడ తాను సాధించిన మంచి పేరు ఏదైనా ఉందంటే అందులో సీజేకు సగం దక్కాల్సి ఉంటుందన్నారు.

అంతకుముందు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) పసల పొన్నారావు మాట్లాడారు. జస్టిస్‌ నరేందర్‌ తీర్పులు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువ న్యాయవాదులను ఎంతగానో ప్రోత్సహించారన్నారు.

అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్‌ నరేందర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, దుర్గమ్మ చిత్ర పటాన్ని బహూకరించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు నేతృత్వంలో సంఘం కార్యవర్గం కూడా జస్టిస్‌ నరేందర్‌ను సత్కరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement