సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు | Home Pensions with Secretariat Employees in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు

Published Tue, Jun 25 2024 4:44 AM | Last Updated on Tue, Jun 25 2024 4:44 AM

Home Pensions with Secretariat Employees in Andhra Pradesh

రాష్ట్ర మంత్రి మండలి తొలి సమావేశంలో నిర్ణయం

16,347 టీచర్‌ పోస్టులతో డీఎస్సీకి ఆమోదం

28 నుంచి దశల వారీగా 7 శ్వేత పత్రాల విడుదల

ఆగస్టులో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం

గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ

పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులకు ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది ఫించన్‌ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యో గుల ద్వారా ఇంటివద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు జూలై 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి మండలి తొలిసా­రిగా సమావేశమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి విలేకరులకు వెల్లడించారు. డీఎస్సీ 2024 ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎస్జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్‌ అసిస్టెంట్‌లు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపాల్స్‌ 52 పోస్టులను భర్తీ చేయ­నున్నారు. డీఎస్సీ ఇకపై నిరంతర ప్రక్రి­యగా ఏటా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. 

టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌)ను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నియామకాల కంటే ముందే టీచర్లకు శిక్షణ డిసెంబర్‌ 10వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు  సూచించారు. ప్రస్తుత విద్యా విధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అధ్యయనం చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని నిర్దేశించారు.

⇒ ఆంధ్రప్రదేశ్‌ భూహక్కు చట్టం 2022 (యాక్ట్‌ 27 ఆఫ్‌ 2023) రద్దు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ‘సరైన అవగాహన లేని టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తారని గుర్తించాం. నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వైరుధ్యం ఉంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భూ యజమానులు ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ను పొందే అవకాశాన్ని కల్పిస్తాం’ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. 

⇒ సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకంగా పేరు మార్పు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన పింఛన్‌ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్‌ బకాయిలతో కలిపి మొత్తంగా రూ.7 వేలను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ రూ. 3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్‌ రూ.15 వేలకు, కిడ్నీ, లివర్, బైలేట్రల్‌ ఎలిఫెంటాసిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్‌ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. డయాలసిస్, సికిల్‌సెల్‌ ఎనీమియా, థలసేమియా, హెచ్‌ఐవీ తదితర బాధితులకు పెన్షన్‌ పంపిణీ డీబీటీ ద్వారా చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పెన్షన్‌ పెంపు నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.

⇒ ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య సెన్సెస్‌ 2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 4.4 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. డిమాండ్, సప్లై, అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్‌ గ్యాప్‌ను అంచనా వేయడం, అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నైపుణ్య సర్వేను 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 

⇒ రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది.  

⇒ విజయవాడలోని డా.వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా తిరిగి మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

⇒ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్వ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించింది.

⇒ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని, చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించేలా కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని పేర్కొన్నారు. 

రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌ అండ్‌ బీకి ఆదేశాలిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, హోం, ఎక్సైజ్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

7 శ్వేత పత్రాలు
గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం (ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి వీటిని విడుదల చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement