సమీక్షలో మంత్రి చెరుకువాడ, అజయ్ జైన్, నారాయణ భరత్ గుప్తా
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ నాటికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం తొలిదశ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.
ఈ నేపథ్యంలో నాణ్యతలో రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండరాదన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కాలనీల్లో ప్రజలకు ఆరోగ్యకర జీవన పరిస్థితుల కల్పనపై ప్రభుత్వానికి ప్రత్యేకశ్రద్ధ ఉందని చెప్పారు. ప్రత్యేకాధికారులు తరచు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించాలని, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్లులు అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌పాండే, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment