సాక్షి,తాడేపల్లి: ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని,బాబు హయాంలో గతంలో ఏనాడూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. శనివారం(జనవరి18) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పార్టీ ఆఫీసులో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
‘వైఎస్ జగన్ తన హయాంలో 30.6లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.71 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు.25,374 ఎకరాలను పేద ప్రజల కోసం వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. టిడ్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు.అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు లక్షల మందికి భూమిని పంచి పెట్టారు.ఆయన కుమారుడు మళ్ళీ 33 లక్షలమందికి పట్టాలిచ్చారు.చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారు.
కానీ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవటం దారుణం. వైఎస్ జగన్ రాజకీయాలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలను లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? ఒక్కొక్కరికి మూడు నుంచి పది లక్షల విలువైన భూమిని వైఎస్ జగన్ అందించారు.పేదలకు సంపద సృష్టించి,ఆత్మగౌరవం నిలపెట్టేలా వైఎస్ జగన్ వ్యవహరించారు.
80 శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు వారి నుంచి భూములను లాక్కుని రోడ్డున పడేస్తారా? 17 వేల ఊర్లను వైఎస్ జగన్ నిర్మించారు.ఇలా చేయాలనుకుంటే చంద్రబాబు కూడా భూమిని కొని పేదలకు అందించాలి. వైఎస్ జగన్ నిర్మించిన కాలనీలు,గ్రామ సచివాలయాలు,బాగుపడిన స్కూళ్లలోకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు? అక్కడకు వెళ్తే వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని భయమా? సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ఎందుకు గౌరవించటం లేదు? సచివాలయాల నిర్మాణాలు తప్పయితే అదే విషయాన్ని ప్రకటించాలి.
రాజధానిలో చంద్రబాబు పెద్ద ఎత్తున భూ స్కామ్ చేశారు. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. 9 లక్షల ఎకరాలను జగన్ 22A నుంచి తప్పించి రైతులకు హక్కులు కల్పించారు.25 లక్షలమంది రైతులకు మేలు చేశారు. రాజధానిలో 50 వేల మంది పేదలకు వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలిచ్చారు.చంద్రబాబు వారందరికీ అన్యాయం చేస్తూ స్థలాలను లాగేసుకున్నారు. రాజధానిలో ఎస్సీ,ఎస్టీలు ఉండకూడదా? పేదల స్థలాలను లాగేసుకుంటే న్యాయపోరాటం చేస్తాం’అని సుధాకర్‌బాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: బాబు పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది: భూమన
Comments
Please login to add a commentAdd a comment