సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ యోగం కల్పించే బృహత్తర యజ్ఞానికి సమయం ఆసన్నమైంది. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ఇళ్ల స్థల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ భూమి పూజలను పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రారంభిస్తారు. 26 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పట్టాల పంపిణీ చేయడంతోపాటు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
అత్యంత పారదర్శకంగా, ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగని విధంగా ఇప్పటికే టిడ్కో ఇళ్లతో కలిపి 30.75 లక్షల మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. ఎంపికైన వారి పేర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించారు. జాబితాలో పేరు లేని అర్హులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించి, అలా వచ్చిన అర్జీలను కూడా పరిశీలించి అర్హులైతే లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. లబ్ధిదారుల ఎంపిక ఇంత పకడ్బందీగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించిన తర్వాత కూడా సోషల్ ఆడిట్ నిర్వహించారు. అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉదాత్త ఆశయంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల విలువైన 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరించింది. భూమిని చదును చేసి వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో 17,004 కాలనీల్లో లేఅవుట్లు సిద్ధం చేసింది.
రిజిస్ట్రేషన్ శాఖకు క్రిస్మస్ సెలవు రద్దు
ఈ నెల 25న క్రిస్మస్/ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సెలవుగా ప్రకటించినప్పటికీ, టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలన్నీ మామూలుగా పని చేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
పొజిషన్ సర్టిఫికెట్లు కూడా..
► 25వ తేదీ ఒక్కరోజే 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల పేరుతో విక్రయ రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేసింది. వీరందరికీ ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇంటిని అప్పగిస్తారు. అదేవిధంగా 365 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుడు తన వాటాగా రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికైతే రూ.లక్ష చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అందులో సగం (365 చ.అ ఇంటికి రూ.25 వేలు, 430 చ.అ ఇంటికి రూ.50 వేలు) చెల్లిస్తే చాలని ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. మొత్తంగా టిక్కో ఇళ్లకు ప్రభుత్వంపై రూ.7,251.80 కోట్ల భారం పడుతోంది.
► ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని క్రమబద్ధీకరణ అర్హత పొందిన వారికి పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇళ్లపట్టాలతోపాటు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి లబ్ధిదారుకు స్థలం పట్టా/టిడ్కో ఇంటి రిజిస్ట్రేషన్ పత్రంతోపాటు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతకంతో కూడిన లేఖను అందజేస్తారు.
కొమరగిరిలో చకచకా ఏర్పాట్లు
► తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో వైఎస్సార్ జగనన్న కాలనీ మోడల్ కాలనీగా రూపుదిద్దుకోనుంది. ఇక్కడి నుంచే ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. వేదిక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మోడల్ హౌస్, పైలాన్ ఏర్పాటు చేశారు.
► కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీ కోసం మొత్తం 367.58 ఎకరాలు సేకరించారు. ఇందులో 60 ఎకరాలను సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, గ్రంథాలయం, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలు, పార్కులు, ఆట స్థలం కోసం కేటాయించారు.
► కాకినాడ అర్బన్ ప్రాంతానికి చెందిన 16,500 మంది లబ్ధిదారులకు ఇక్కడ ప్లాట్లు ఇవ్వనున్నారు. మొదటి దశలో ఇక్కడ 12,500 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కాలనీ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో, అంతర్గత రోడ్లు 20 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment