
కర్నూలు (సెంట్రల్)/ఆళ్లగడ్డ: సంతానం ఉండి కూడా తల్లిని అనాథగా వదిలేయడం సరైన విధానం కాదని, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే అని హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) వ్యాఖ్యానించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని దేవరాయపురం కాలనీకి చెందిన పి.ఓలమ్మ (75) ను కుమార్తెలు, కుమారులు అనాథగా వదిలేయడంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఓలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఓలమ్మ భర్త 25 ఏళ్ల క్రితమే చనిపోయినా పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఇటీవల ఆమె పక్షవాతానికి గురి కావడంతో కుమారులు, కోడళ్లు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. దీంతో తన బిడ్డలకు ఇచ్చిన మూడెకరాలను తిరిగి ఇప్పించాలని పెద్దలను కోరినా..వారెవరూ వినిపించుకోలేదు. దీంతో రోడ్డున పడిన ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది.
సాక్షి వార్తపై హెచ్‌ఆర్‌సీ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యూడిషియల్, నాన్ జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావులు స్పందించారు. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం ఓలమ్మకు న్యాయం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్, ఆళ్లగడ్డ తహసీల్దార్, ఓలమ్మ సంతానానికి నోటీసులిస్తూ కేసు డిసెంబర్ 13కి వాయిదా వేశారు. కాగా, హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించారు. ఓలమ్మ ఉంటున్న ప్రదేశానికి చేరుకుని విచారించారు. తక్షణం ఆశ్రయం కల్పించేందుకు ఆమెను ఆళ్లగడ్డలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రానికి తరలించారు.