డిస్టిలరీలు, సిండికేట్‌లకు మార్జిన్ రెట్టింపు
అందుకోసం పన్ను రేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: టీడీపీ సిండికేట్‌కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ఇదే అదునుగా మద్యం మాఫియా దోపిడీకి అధికారికంగా తెరతీసింది. మద్యంపై భారీగా పన్నుల బాదుడుతోపాటు టీడీపీ నేతల డిస్టిలరీలు, మద్యం సిండికేట్‌లకు అడ్డగోలుగా భారీ లాభాలొచ్చేలా పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం డిస్టిలరీలు, దుకాణదారులకు కలిపి 10 శాతం లాభాన్ని మార్జిన్‌గా విధించారు.
తాజాగా ప్రభుత్వం డిస్టిలరీలు, మద్యం సిండికేట్‌లతో కుమ్మక్కై అధికారిక లాభాల మార్జిన్‌ను రెట్టింపు చేస్తూ 20 శాతానికి పెంచింది. ఆ మేరకు మద్యం ఉత్పత్తుల గరిష్ట ధర(ఎంఆర్‌పీ)ని నిర్ణయించనుంది. దాంతో ఓ వైపు మద్యం ధరల మోత మోగనుంది. మరోవైపు టీడీపీ సిండికేట్‌లకు కాసుల పంట పండనుంది. ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను(ఏఆర్‌టీ)ను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యసనాన్ని మాన్పించేందుకు డీ–అడిక్షన్ కేంద్రాల నిర్వహణ కోసం మద్యం ఉత్పత్తులపై 2 శాతం సెస్‌ను విధించింది. మత్తు వదిలించేందుకంటూ మద్యం ఉత్పత్తులపై పన్ను విధించి ఆదాయం ఆర్జించే ఎత్తుగడ వేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment