సాక్షి, విజయవాడ: మద్యాన్ని కూటమి సర్కార్ ఆదాయ వనరుగా మార్చుకుంది. రాష్ట్రంలో ఈ రోజు(శుక్రవారం) రాత్రి 7 గంటలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు ముగియగా.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. 3,396 మద్యం దుకాణాలకు 87,508 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు రాగా, ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు 5,704 దరఖాస్తులు వచ్చాయి.
నెల్లూరులో తమ అనుచరులకే మద్యం దుకాణాలు ఇప్పిస్తున్నట్లు మంత్రి నారాయణ ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల దందాతో మద్యం వ్యాపారులు భయపడుపోతున్నారు. దీంతో దరఖాస్తులు వేసేందుకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపులకు ఇతరులు దరఖాస్తులు చేయకుండా కూటమి నేతలు బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతలు పేర్లు మీదే మంత్రులు, ఎమ్మెల్యేలు దరఖాస్తులు వేయించారు. టీడీపీ నేతలకు ఎక్సైజ్ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల డైరెక్షన్‌లో మద్యం మాఫియా చెలరేగిపోయింది. మద్యం షాపులు దక్కించుకునేందుకు బెదిరింపులకు దిగింది.
కాగా, ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిచింది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి: మద్యం షాపులన్నీ నాకే కావాలి..!
తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది.
వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను స్కార్పియోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్‌ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు.
Comments
Please login to add a commentAdd a comment