కురగల్లులోని ఎస్సీ రైతులకు 1987లో ఇచ్చిన అసైన్డ్ భూమి పట్టా
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది.
అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో..
రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ
అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు.
ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది.
అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్‌డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు.
ఏమార్చిన విధానం ఇలా..
టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్‌కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్‌కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది.
ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్‌డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్‌డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్‌డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు.
భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది.
జీవోలిచ్చి క్రమబద్ధీకరణ..
► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు.
► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్‌ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు.
ఇంకేం రుజువులు కావాలి?
మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్‌డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు.
– దావు మోహన్‌రావు, అసైన్డ్ రైతు, కురగల్లు
Comments
Please login to add a commentAdd a comment