కుమార్తెతో కలిసి ధర్నా చేస్తున్న బాధితురాలు
సాక్షి, ఒంగోలు: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఆ జంట ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల పాటు కాపురం చేసిన వీరికి కుమార్తె కలిగింది. తిరిగి స్వదేశం వచ్చాక వివాహం తూచ్ అంటూ..పెళ్లానికి ముఖం చాటేయడంతో ఆ యువతి మోసపోయానంటూ కొమరోలు మండలం అల్లీనగరంలోని భర్త ఇంటి ముందు ఆదివారం ధర్నాకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని అలీనగరం గ్రామానికి చెందిన ఆవులమంద శేఖర్ బతుకుతెరువు కోసం సౌదీ వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటున్న సమయంలో వైఎస్సార్ జిల్లా చెన్నూరుకు చెందిన యువతి నాగమణితో సాన్నిహిత్యం ఏర్పడింది. అది ప్రేమగా మారి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సౌదీలోనే వివాహం చేసుకుని అక్కడే ఆరేళ్ల పాటు కలిసి జీవించారు. వీరి దాంపత్య జీవితానికి ఐదేళ్ల కుమార్తె ఉంది. సౌదీ నుంచి తిరిగి తన స్వగ్రామం వచ్చిన శేఖర్.. భార్యను పట్టించుకోలేదు.
ఆమె ఎవరో తనకు తెలియదంటూ ముఖం చాటేశాడు. తనకు భర్త కావాలంటూ పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా తనకు రూ.నాలుగు లక్షల కట్నం కావాలని, డబ్బులు ఇస్తే భార్యగా ఒప్పుకుని కాపురానికి తెచ్చుకుంటానని శేఖర్ చెప్పినట్లు బాధిత యువతి చెబుతోంది. తాను దేశంకాని దేశం వెళ్లి సంపాదించిందంతా దాదాపు రూ.8 లక్షల వరకు తన భర్తకే ఇచ్చానని, ఇక ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని బాధితురాలు వాపోతోంది. రెండు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇప్పటికీ రాలేదని, అత్తమామలు తనకు, తన కుమార్తెకు అన్నం పెట్టకుండా ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది. రెండు రోజులుగా తాను నిద్రహారాలు లేకుండా ఉన్నానని, చేసేది లేక ఇంటి ముందే ధర్నా చేస్తున్నట్లు కన్నీటిపర్యంతమైంది. అధికారులు తనకు న్యాయం చేయాలని నాగమణి కోరుతోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. శేఖర్‌ను పట్టుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, దీక్ష విరమించి ఇంటికెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment