థీమ్‌ పార్కులు.. టూరిజం క్లస్టర్లు | Inauguration Of AP Tourism Policy 2020-25 | Sakshi
Sakshi News home page

థీమ్‌ పార్కులు.. టూరిజం క్లస్టర్లు

Published Sun, Dec 20 2020 4:09 AM | Last Updated on Sun, Dec 20 2020 4:09 AM

Inauguration Of AP Tourism Policy 2020-25 - Sakshi

ఏపీ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి తదితరులు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఉపాధికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ఆ దిశగా కార్యాచరణ చేపట్టేందుకు కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏపీ టూరిజం పాలసీ 2020–25ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో శనివారం ఆవిష్కరించారు. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసేందుకు రీ స్టార్ట్‌ ప్యాకేజీతో ప్రభుత్వం ఆదుకోనుంది. పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, రాజమండ్రి కేంద్రంగా ఉభయ గోదావరి, విజయవాడ–గుంటూరు కేంద్రంగా కోస్తా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో అన్ని క్లస్టర్లలో పెట్టుబడిదారులతో సదస్సులు (ఇన్వెస్టర్స్‌ మీట్స్‌) నిర్వహించనున్నారు.

ఎన్నో రాయితీలు.. మరెన్నో ప్రోత్సాహకాలు
కొత్త టూరిజం ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసే సంస్థలకు అందించే స్థలం విలువపై వసూలు చేసే 2 శాతం అద్దెకు బదులు 1 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రూ.కోటి పెట్టుబడి, ఏడాది ఆదాయం రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టుల్ని మైక్రో ప్రాజెక్టులుగా, రూ.10 కోట్లలోపు పెట్టుబడి, రూ.50 కోట్లలోపు ఆదాయం ఉంటే స్మాల్‌ ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లలోపు పెట్టుబడి, రూ.250 కోట్లలోపు ఆదాయం ఉంటే మీడియం ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లకు పైగా పెట్టుబడి, రూ.400 కోట్ల వరకూ ఆదాయం ఉంటే లార్జ్‌ ప్రాజెక్టులుగా, రూ.400 కోట్లు పైబడి పెట్టుబడి ఉంటే మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తారు.

ల్యాండ్‌ యూజ్‌ కన్వర్జెన్స్‌ చార్జీల్ని నూరు శాతం మాఫీ చేయనున్నారు. టూరిజం యూనిట్స్‌ కోసం స్థలాల్ని కొనుగోలు చేసినా, భూములు, షెడ్స్, బిల్డింగ్స్‌ మొదలైనవి లీజుకు తీసుకున్నా స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. కొత్తగా వచ్చే టూరిజం ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు 100 శాతం స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) నుంచి మినహాయింపును రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌ను రూ.2 కే అందిస్తారు. మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్‌ టూరిజం ప్రాజెక్టుల్లో హోటల్స్‌ కోసం 5 ఎకరాల వరకూ.. రిసార్టుల కోసం 10 ఎకరాల వరకూ.. ఎంఐసీఈ సెంటర్లకు 10 ఎకరాల వరకూ.. వే సైడ్‌ ఎమినిటీస్‌ కోసం 3 ఎకరాల వరకూ స్థలం కేటాయిస్తారు. 5 స్టార్, 7 స్టార్‌ హోటల్స్‌తో పాటు మెగా టూరిజం ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాల్ని సమకూరుస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా థీమ్‌ పార్కులు
నూతన విధానం కింద రాష్ట్రవ్యాప్తంగా థీమ్‌ పార్కులు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు ఏర్పాటవుతాయి. çహోటల్స్, రిసార్టులు, వాటర్‌ విల్లాస్, హెరిటేజ్‌ హోటల్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, థీమ్‌ పార్కులు, ఎంఈసీఈ సెంటర్లు, గోల్ఫ్‌ కోర్సులు, బొటానికల్‌ గార్డెన్లు, అర్బన్, రూరల్‌ హట్స్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్, వే సైడ్‌ ఎమినిటీస్, స్పిరిచ్యువల్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, మ్యూజియమ్స్, ఫార్మ్‌ స్టేలు, అగ్రి టూరిజం.. ఇలా విభిన్న ప్రాజెక్టులతో ఆయా సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. బుద్ధిస్ట్‌ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం, రూరల్‌ టూరిజం, హెరిటేజ్‌ టూరిజంగా విభజించి ప్రాజెక్టుల్ని ఆహ్వానించనున్నారు. టూరిజం పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకానికి పునరుజ్జీవం
గత ప్రభుత్వం అమలు చేసిన టూరిజం పాలసీ.. పర్యాటక వర్గాలకు చేదు అనుభవాన్నిచ్చింది. అందుకే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్‌ కూడా రాలేదు. సీఎం జగన్‌ సూచనల మేరకు కొత్త పాలసీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రచారాలు, వివిధ సంస్థలతో భేటీలు నిర్వహిస్తాం. కేవలం ఆదాయంపైనే కాకుండా.. పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా వాటిని సందర్శించేలా పక్కా నిబంధనలు అమలు చేస్తాం.   
 – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement