Tourism project
-
సాగర్ వద్ద ఆధ్యాత్మిక టూరిజం ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ గ్రూపు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్ సమీపంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా సున్య ఇంటర్నేషనల్ పేరుతో ఆధ్యాత్మిక, ఆయుర్వేద టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. నాగార్జున కొండకు సమీపంలో పల్నాడు జిల్లా మాచర్ల వద్ద 110 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి డీఎక్స్ఎన్ మాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనలు సమర్పించింది. లీజు విధానంలో 99 ఏళ్లకు 110 ఎకరాలు కేటాయించాల్సిందిగా శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ సెంటర్లో 1,000 మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా మందిరంతో పాటు 7 స్టార్ హోటల్ సదుపాయాలతో రిసార్ట్, 50 పడకల హాస్పిటల్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఔషధ వనం, తద్వారా ఆయుర్వేద మందులను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా లక్ష మంది పర్యాటకులు సున్య ఇంటర్నేషనల్ సెంటర్‌ను సందర్శిస్తారని, ఇందులో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. డీఎక్స్ఎన్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన గోవింద్ రెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బియ్యం నుంచి ఇథనాల్ తయారీ యూనిట్ పాడైన బియ్యం, ఇతర ధాన్యాల నుంచి ఇథనాల్ తయారు చేసే యూనిట్‌ను రాజమండ్రి వద్ద అస్సాగో గ్రూపు ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడితో 21 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ భూమి కోసం ఏపీఐఐసీకి సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసింది. భూమి కేటాయింపు జరగ్గానే, భూమి పూజ చేసి.. పనులు మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. భూ కేటాయింపుతో పాటు అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని కంపెనీ ప్రతినిధులు ఏపీఐఐసీ చైర్మన్‌ను కోరారు. ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. -
రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్టీజీ తీరును తప్పుబట్టిన సుప్రీం
-
రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. ఎన్జీటీ తీరు సరికాదు: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు దాఖలైన ఓ పిటిష్‌పై మంగళవారం వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ రఘురామకృష్ణ లేఖ ఆధారంగా ప్రాజెక్టుపై స్టే ఉత్తర్వులిచ్చింది ఎన్జీటీ. అయితే ఏకపక్షంగా ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది సుప్రీం కోర్టు. ఇక ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వొకేట్ సింఘ్వి. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతోందని, రూ. 180 కోట్లు పెట్టబడులు ఏపీ ప్రభుత్వం పెట్టిందని కోర్టుకు తెలిపారాయన. ఓ ఎంపీ లేఖపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో ఎన్జీటీ తీరును తప్పుబట్టిన సుప్రీం.. విచారణ రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. -
‘సకాలంలో పర్యాటక ప్రాజెక్టుల పూర్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పర్యాటక ప్రాజెక్టులను గడువులోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ఆదేశించారు. మంగళవారం ఆయన పర్యాటక, క్రీడలపై అధికారులతో సమీక్షించారు. వరంగల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనుల్లో జాప్యంపై ఆయన మండిపడ్డారు. వెంటనే పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అలాగే పీవీ స్మృతి వనం పనులనూ వేగంగా పూర్తి చేయాలన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో శిల్పారామం, ట్యాంక్‌బండ్ సుందరీకరణ, బడ్జెట్ హోటల్ నిర్మాణాలు జూన్‌లోగా పూర్తి కావాలన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న నీరా కేఫ్ మార్చి నాటికి సిద్ధం కావాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానం ఉండాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పనుల్లో కూడా వేగం అవసరమన్నారు. క్రీడా విధానాన్ని రూపొందించేందుకు ఏర్పడ్డ కేబినెట్ సబ్‌కమిటీ భేటీకి ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. లాల్‌బహదూర్ స్టేడియం ఆధునీకరణకు వీలుగా ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి రమేశ్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్‌రెడ్డి, క్రీడా శాఖ అధికారులు సుజాత, ధనలక్ష్మి, చంద్రావతి, హరికృష్ణ పాల్గొన్నారు. -
థీమ్ పార్కులు.. టూరిజం క్లస్టర్లు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఉపాధికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ఆ దిశగా కార్యాచరణ చేపట్టేందుకు కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏపీ టూరిజం పాలసీ 2020–25ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో శనివారం ఆవిష్కరించారు. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసేందుకు రీ స్టార్ట్ ప్యాకేజీతో ప్రభుత్వం ఆదుకోనుంది. పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, రాజమండ్రి కేంద్రంగా ఉభయ గోదావరి, విజయవాడ–గుంటూరు కేంద్రంగా కోస్తా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో అన్ని క్లస్టర్లలో పెట్టుబడిదారులతో సదస్సులు (ఇన్వెస్టర్స్ మీట్స్) నిర్వహించనున్నారు. ఎన్నో రాయితీలు.. మరెన్నో ప్రోత్సాహకాలు కొత్త టూరిజం ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసే సంస్థలకు అందించే స్థలం విలువపై వసూలు చేసే 2 శాతం అద్దెకు బదులు 1 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రూ.కోటి పెట్టుబడి, ఏడాది ఆదాయం రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టుల్ని మైక్రో ప్రాజెక్టులుగా, రూ.10 కోట్లలోపు పెట్టుబడి, రూ.50 కోట్లలోపు ఆదాయం ఉంటే స్మాల్ ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లలోపు పెట్టుబడి, రూ.250 కోట్లలోపు ఆదాయం ఉంటే మీడియం ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లకు పైగా పెట్టుబడి, రూ.400 కోట్ల వరకూ ఆదాయం ఉంటే లార్జ్ ప్రాజెక్టులుగా, రూ.400 కోట్లు పైబడి పెట్టుబడి ఉంటే మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ల్యాండ్ యూజ్ కన్వర్జెన్స్ చార్జీల్ని నూరు శాతం మాఫీ చేయనున్నారు. టూరిజం యూనిట్స్ కోసం స్థలాల్ని కొనుగోలు చేసినా, భూములు, షెడ్స్, బిల్డింగ్స్ మొదలైనవి లీజుకు తీసుకున్నా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీని 100 శాతం రీయింబర్స్మెంట్ చేస్తారు. కొత్తగా వచ్చే టూరిజం ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు 100 శాతం స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) నుంచి మినహాయింపును రీయింబర్స్మెంట్ ద్వారా చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌ను రూ.2 కే అందిస్తారు. మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ టూరిజం ప్రాజెక్టుల్లో హోటల్స్ కోసం 5 ఎకరాల వరకూ.. రిసార్టుల కోసం 10 ఎకరాల వరకూ.. ఎంఐసీఈ సెంటర్లకు 10 ఎకరాల వరకూ.. వే సైడ్ ఎమినిటీస్ కోసం 3 ఎకరాల వరకూ స్థలం కేటాయిస్తారు. 5 స్టార్, 7 స్టార్ హోటల్స్‌తో పాటు మెగా టూరిజం ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాల్ని సమకూరుస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ పార్కులు నూతన విధానం కింద రాష్ట్రవ్యాప్తంగా థీమ్ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటవుతాయి. çహోటల్స్, రిసార్టులు, వాటర్ విల్లాస్, హెరిటేజ్ హోటల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, థీమ్ పార్కులు, ఎంఈసీఈ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, బొటానికల్ గార్డెన్లు, అర్బన్, రూరల్ హట్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, వే సైడ్ ఎమినిటీస్, స్పిరిచ్యువల్ వెల్నెస్ సెంటర్లు, మ్యూజియమ్స్, ఫార్మ్ స్టేలు, అగ్రి టూరిజం.. ఇలా విభిన్న ప్రాజెక్టులతో ఆయా సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. బుద్ధిస్ట్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, రూరల్ టూరిజం, హెరిటేజ్ టూరిజంగా విభజించి ప్రాజెక్టుల్ని ఆహ్వానించనున్నారు. టూరిజం పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. పర్యాటకానికి పునరుజ్జీవం గత ప్రభుత్వం అమలు చేసిన టూరిజం పాలసీ.. పర్యాటక వర్గాలకు చేదు అనుభవాన్నిచ్చింది. అందుకే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. సీఎం జగన్ సూచనల మేరకు కొత్త పాలసీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రచారాలు, వివిధ సంస్థలతో భేటీలు నిర్వహిస్తాం. కేవలం ఆదాయంపైనే కాకుండా.. పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా వాటిని సందర్శించేలా పక్కా నిబంధనలు అమలు చేస్తాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
ఆ 6 ఊళ్లకు పర్యాటక శోభ
- బమ్మెర, పాలకుర్తి, ఖిలా షాపూర్, జఫర్గడ్, పెంబర్తి, వల్మిడితో ప్రత్యేక ప్రాజెక్టు - ఫైలుపై సీఎం సంతకం.. తొలి దశలో రూ.40 కోట్లతో అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: మహాకవి బమ్మెర పోతనది వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట అని కొందరు చేస్తున్న ప్రచారం తప్పని నిరూపించి, పూర్వపు ఓరుగల్లు జిల్లా బమ్మెరకు చెందిన వ్యక్తిగా ప్రపంచం ముందు నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జనగామ జిల్లా పరిధిలో ఉన్న బమ్మెర గ్రామంలోనే ఆయన జన్మించి, తెలంగాణ గడ్డపై మహాకవిగా చెరగని ముద్రవేసుకున్నా డని చాటబోతోంది. ఇందుకు ఉన్న సాక్ష్యాలను కళ్లముందు ఉంచటంతోపాటు ఆ మహాకవి తిరగాడిన బమ్మెర గడ్డను అభివృద్ధి చేసి పర్యాటక శోభ అద్దనుంది. అలాగే ఆదరణ కోల్పోతున్న పెంబర్తి హస్తకళలకు ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించాలని సంకల్పించింది. పర్యాటకులు స్వయంగా వచ్చి హస్త కళాకారుల నైపుణ్యాన్ని పరిశీలించేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతోంది. ఈ పర్యాటక ప్రాజెక్టులో మొత్తం ఆరు చారిత్రక గ్రామాలను చేర్చారు. బమ్మెర, పెంబర్తి, ఖిలా షాపూర్, జఫర్గడ్, వల్మిడి, పాలకుర్తి ఇందులో ఉన్నాయి. తొలి విడతలో ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల బమ్మెర గ్రామ పర్యటనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే. సంబంధిత ఫైలుపై బుధవారం ఆయన సంతకం చేశారు. ఈ ఆరు గ్రామాల అభివృద్ధి పనులకు పర్యాటక శాఖ త్వరలో శ్రీకారం చుట్టనుంది. బమ్మెర: పోతన నడయాడిన నేల భాగవతాన్ని తేట తెలుగులో మనకందిం చిన పోతన జీవించిన నేల బమ్మెరలో ఆయన సమాధి ఉంది. ఆయన సాగు చేసినట్టుగా చెప్తున్న పొలాలు, దిగుడుబావి పోతన మడ్లు గా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని సుంద రంగా మార్చి పోతన జీవిత చరిత్రను మ్యూజి యం రూపంలో అందుబాటులోకి తెస్తారు. ఆయన జీవిత విశేషాలు, ఆధారాలను పొందుపరుస్తారు. ఇక్కడి త్రికూటాలయాన్ని అభివృద్ధి చేస్తారు. రింగురోడ్డు నిర్మిస్తారు. జఫర్గడ్: చరిత్రకు సజీవ సాక్షం రాష్ట్రకూటుల సామంతుడు శంకరగండడు నిర్మించిన నరసింహస్వామి దేవాలయం ఈ గ్రామ ప్రత్యేకత. దానికి సంబంధించి కోనేరుపై శాసనం చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. గుట్ట మీద ఈ ఆలయం, దిగువన త్రికూటాలయం, గంటల గుడి– దాని ఎదుట ఒకప్పుడు గంటలు వేలాడిన 30 అడుగున రాతి స్తంభం ఆకట్టుకుంటాయి. కుతుబ్‌షాహీలకు సామంతుడిగా ఉండి స్వతంత్రుడిగా ప్రకటించుకునే ఆలోచనతో జాఫరుద్దౌలా మూడు దర్వాజాలతో నిర్మించి న భారీ కోట, ఫిరంగులు అప్పటి చరిత్రను కళ్లకు కడుతున్నాయి. గుట్ట చుట్టు రోడ్డు, ఆలయాల వద్ద పర్యాటకులకు వసతులు, లాన్లు, రెస్టారెంట్లు నిర్మిస్తారు. కోట దర్వాజాలను బాగు చేసి సుందరీకరిస్తారు. ఖిలా షాపూర్: సర్వాయి పాపన్న పరాక్రమానికి సాక్ష్యం అత్యంత బలమైన మొగల్ సామ్రాజ్యాన్ని గెరిల్లా పోరాట పటిమతో ముప్పుతిప్పలు పెట్టి సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న సొంతూరు ఖిలా షాపూర్. నేటికీ నిలిచి ఉన్న గడీలు, బురుజులను అభివృద్ధి చేస్తారు. పెంబర్తి: హస్తకళల కాణాచి పెంబర్తి అనగానే లోహపు రేకులపై కళాకృ తులు గుర్తొస్తాయి. రేకులపై నగిషీలు చెక్కి అందంగా తీర్చిదిద్దటంలో పెంబర్తి కళాకారు లది అందెవేసిన చేయి. వారు రూపొందించిన కళాకృతులకు విదేశాల్లో మం చి డిమాండ్ ఉంది. ఆ కళాకారులకు పూర్వపు ఆదరణను పునరుద్ధరించేందుకు పర్యాట కులే ఆ ప్రాంతానికి తరలివచ్చేలా ఏర్పా ట్లు చేస్తారు. ఇందుకోసం అక్కడ కల్చర ల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. సరైన వసతు లు కూడా లేని ఇరుకు ఇళ్లలోనే కళాకారులు వస్తువులను రూపొందిస్తు న్న తీరును మార్చి వారికి ప్రత్యేక వేదికలు సిద్ధం చేస్తారు. పాలకుర్తి: సోమనాథకవి పెరిగిన ప్రాంతం బసవపురాణం, బసవ శతకం రచించిన కవి సోమనాథుని స్వగ్రామం. 12వ శతాబ్దంలో నిర్మించిన సోమేశ్వరాలయం అద్భుతంగా ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేయటంతో పాటు భక్తులు, పర్యాటకులకు వసతులు కల్పిస్తారు. వల్మిడి: నాటి వాల్మీక పురమేనట రామాయణాన్ని రాసిన వాల్మీకి ఈ ప్రాంతానికి చెందినవాడనే ప్రచారముంది. సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది ఇక్కడేనంటా రు. రాములవారితో లవకుశుల పోరాటం జరిగినట్టు గుట్టల్లో ఆధారాలున్నాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది. దీనికి గుర్తుగానా అన్నట్టు గుట్టపై నిర్మించిన రామాలయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ గుట్టను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మారుస్తారు. -
సమగ్ర కండలేరుగా తీర్చిదిద్దాలి
రాపూరు, న్యూస్‌లైన్: కండలేరు జలాశయాన్ని సమగ్ర కండలేరుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. కండలేరు జలాశయ అతిథిగృహంలో బుధవారం ఆయన కలెక్టర్ శ్రీకాంత్, ఇరిగేషన్, తెలుగుగంగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐఏబీ తీర్మానం మేరకు ఆయకట్టుకు నీటివిడుదలపై చర్చించామన్నారు. లోలెవల్ స్లూయీస్‌కు నీరు అందిన తర్వాత మనుబోలుకు విడుదల చేస్తామన్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది కండలేరు జలాశయంలో 50 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. పొదలకూరు, మనుబోలు, చేజర్ల మండలాల్లోని 50 వేల ఎకరాలకు కండలేరు ఎడమ కాలువ ద్వారా నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.62 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. కండలేరు నిర్వాసితులకు చెందిన 1,850 ఎకరాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రతా కమిటీ సూచనల మేరకు జలాశయంలో కొన్ని పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టు పరిధిలో అధిక లోడు వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జలాశయం పరిధిలో 316 హెక్టార్ల అటవీ భూములున్నాయని, ఆ శాఖ నుంచి అనుమతి లభించినందున ఆ భూముల్లో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. అన్ని పూర్తయితే 1.25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వెల్లడించారు. స్పిల్‌వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుగంగ అధికారులను మంత్రి ఆదేశించారు. రూ.2 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్ కండలేరు జలాశయంలో రూ.2 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ఆనం వెల్లడించారు. కొండపై ఇరిగేషన్ శాఖ 3 ఎకరాలను కేటాయిస్తే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం నిర్మిస్తారన్నారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు బీచ్‌లో 10 ఎకరాల విస్తీర్ణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో కలెక్టర్ శ్రీకాంత్, ట్రెయినీ కలెక్టర్ వర్షిణి, ఆర్డీవో సుబ్రమణ్యేశ్వర రెడ్డి, ఎస్ఈలు సుబ్బారావు, కోటేశ్వరావు, ఈఈలు సురేష్‌బాబు, విశ్వనాథం, వెంకట రాజు, శ్రీనివాసరావు, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు చెన్ను బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వెయ్యి కోట్లతో హైలెవ్ కాలువ మొదటి దశ సోమశిల: మెట్ట ప్రాంత ప్రజల సాగు,తాగనీరు అవసరాలు తీర్చేందుకు సోమశిల హైలెవల్ కాలువ మొదటి దశను వెయ్యి కోట్ల నిధులతో ప్రతిపాదించామని, పరిపాలన అనుమతి రాగానే పనులు మొదలవుతాయని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయాన్ని బుధవారం ఆయన కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌తో కలిసి సందర్శించారు. కండలేరు వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్, రేడియల్ క్రస్ట్‌గేట్లను పరిశీలించారు. నీటి లభ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించృరు. అనంతరం సోమశిల అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. హైలెవల్ కెనాల్‌కు ఆనం సంజీవరెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని వెల్లడించారు. సోమశిల జలాశయంలో 59 టీఎంసీల నీటిని నిల్వ చేసి మిగిలిన జలాలను కండలేరుకు తరలిస్తున్నామని చెప్పారు. ఆయకట్టుకు వారం రోజుల్లో నీరు విడుదల చేస్తామన్నారు. కండలేరు వరద కాలువకు నీటి విడుదల ఆపిన వెంటనే లీకేజీలను అరికట్టేందుకు మరమ్మతులు చేపడతామన్నారు. ఆయన వెంట సోమశిల ఎస్ఈ సోమశేఖర్, ఈఈ ఢిల్లేశ్వరరావు, తహశీల్దార్ సోమ్లానాయక్, ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్, నాయకులు వేణుగోపాల్‌రాజు, మెట్టుకూరు కృష్ణారెడ్డి, సుబ్బరాజు, అల్లంపాటి జనార్దన్‌రెడ్డి, ఉప్పల విజయ్‌కుమార్, మెట్టుకూరు రమణారెడ్డి ఉన్నారు.