సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పర్యాటక ప్రాజెక్టులను గడువులోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ఆదేశించారు. మంగళవారం ఆయన పర్యాటక, క్రీడలపై అధికారులతో సమీక్షించారు. వరంగల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనుల్లో జాప్యంపై ఆయన మండిపడ్డారు. వెంటనే పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అలాగే పీవీ స్మృతి వనం పనులనూ వేగంగా పూర్తి చేయాలన్నారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో శిల్పారామం, ట్యాంక్‌బండ్ సుందరీకరణ, బడ్జెట్ హోటల్ నిర్మాణాలు జూన్‌లోగా పూర్తి కావాలన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న నీరా కేఫ్ మార్చి నాటికి సిద్ధం కావాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానం ఉండాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పనుల్లో కూడా వేగం అవసరమన్నారు.
క్రీడా విధానాన్ని రూపొందించేందుకు ఏర్పడ్డ కేబినెట్ సబ్‌కమిటీ భేటీకి ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. లాల్‌బహదూర్ స్టేడియం ఆధునీకరణకు వీలుగా ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి రమేశ్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్‌రెడ్డి, క్రీడా శాఖ అధికారులు సుజాత, ధనలక్ష్మి, చంద్రావతి, హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment