సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నచోట విదేశీ పర్యాటకుల కోసం మద్యం అందుబాటులో ఉంటుందని గురువారం మీడియా సమావేశంలో తాను చెప్పిన మాటల్ని ఓ వర్గం మీడియా వక్రీకరించి రాయడంపై మంత్రి ముత్తంశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టూరిజం ప్రమోషన్‌లో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే రెస్టారెంట్లు ఉంటాయో అక్కడ విదేశీ మద్యం అందుబాటులో ఉంటుంది అని మాత్రమే తాను చెప్పగా.. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధానాన్ని కొత్తగా తెచ్చినట్లు, మద్యాన్ని తామే అందుబాటులో ఉంచుతున్నట్లు కథనాలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టూరిజంను ప్రమోట్ చేయడానికే మద్యంగానీ.. మద్యాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం కాదన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.
ఆత్మ విమర్శ చేసుకోండి..
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న తార, సితార హోటళ్లు, విశాఖలోని డాల్ఫిన్ హోటల్‌లో టూరిస్టుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంటుందని, దాన్ని ఎలా తీసుకోవాలో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తాము మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతుండటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరూరా బెల్టు షాపులను ఏర్పాటు చేసి చివరికి పార్టీ కార్యకర్తల ద్వారా మద్యం అమ్మడం, ఇంటింటికీ డోర్ డెలివరీ ఏర్పాట్లు చేయడం ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు.
చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం...
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 43 వేల బెల్ట్ షాపులను మూసివేయడంతో పాటు మద్యం పర్మిట్ రూములను రద్దు చేసి మద్యం షాపులు, బార్ల సంఖ్యను తగ్గించామని చెప్పారు. మద్య నియంత్రణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పునరుద్ఘాటించారు. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ చంద్రబాబు, లోకేష్ ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచిది కాదన్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మందు విక్రయించిన చంద్రబాబు మద్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉంటుందని ఎద్దేవా చేశారు. చివరకు దేవాలయాలు, పాఠశాలల పక్కన కూడా మద్యం విక్రయించిన ఘనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.
కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్ర ప్రజలు ఏమయ్యారో పట్టించుకోకుండా హైదరాబాద్‌లో కూర్చుని జూమ్ మీటింగ్‌లు నిర్వహిస్తూ తనకు వత్తాసు పలికే మీడియాలో ప్రచురించుకుని ఆనందపడుతున్నారని విమర్శించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు ఇవ్వటాన్ని చిరంజీవి తదితర ప్రముఖులు సైతం అభినందిస్తుంటే అది కూడా రాజకీయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. కేరళ జీడీపీలో 14 శాతం టూరిజం నుంచే వస్తోందని, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగంతో పాటు టూరిజం పెంచాలన్నది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. అంతేకానీ మద్యాన్ని ప్రోత్సహించాలన్నది తమ విధానం కాదని గుర్తెరగాలన్నారు. టూరిజం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓ వర్గం మీడియా వక్రభాష్యాలు చెప్పటాన్ని ఇకనైనా మానుకోవాలని çసూచించారు.
రామోజీ హోటళ్లలో విదేశీ మద్యం అమ్మొచ్చా?
Published Sat, Jun 26 2021 4:35 AM | Last Updated on Sat, Jun 26 2021 11:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment