ఇలాంటి సమాధానాల అన్వేషణే మన మూడేళ్ల పాలన: సీఎం జగన్‌ | independence day 2022:Our 3 Year Rule Answers Many Questions CM Jagan | Sakshi
Sakshi News home page

ఇలాంటి సమాధానాల అన్వేషణే మన మూడేళ్ల పాలన: సీఎం జగన్‌

Published Mon, Aug 15 2022 12:00 PM | Last Updated on Mon, Aug 15 2022 12:37 PM

independence day 2022:Our 3 Year Rule Answers Many Questions CM Jagan - Sakshi

ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. దీనిలో భాగంగా ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్‌. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.  ఆపై తన అద్భుతమైన ప్రసంగంతో సీఎం జగన్‌ ఆకట్టుకున్నారు.( చదవండి: స్వాతంత్ర పోరాటం మహోన్నతం.. ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధన: ఏపీ సీఎం జగన్‌)

అంతర్జాతీయంగా భారత్‌ సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో, దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వతంత్రం... వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్లగా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేకమంది ప్రజల్లో నేటికీ ఉండిపోయిందన్నది కూడా అంతే వాస్తవమన్నారు.

దేశ స్వాతంత్రానికి 75 ఏళ్ల చరిత్ర ఉంటే... మరోవంక, సమ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు కోసం, మహిళల సమాన హక్కుల కోసం, మనుషులుగా గుర్తింపు కోసం, దోపిడీకి గురి కాకుండా జీవించే రక్షణల కోసం... ఈ గడ్డమీద జరుగుతున్న పోరాటాలకు వందలూ వేల ఏళ్ళ చరిత్ర ఉందని సీఎం జగన్‌ మరోసారి గుర్తు చేశారు. 

ఇవన్నీ పరాయి దేశం మీద మనం చేసిన స్వాతంత్య్ర పోరాటాలు కావని, ఇవన్నీ మన సమాజంలో జరుగుతున్న సామాజిక స్వాతంత్ర్య పోరాటాలన్నారు. 

ఈ పోరాటాల్లో కొన్ని సంఘ సంస్కరణ పోరాటాలు!ఇందులో కొన్ని సమాన హక్కుల పోరాటాలు! మరి కొన్ని అణచివేతల మీద మాట్లాడకపోయినా, మనం తిరుగుబాట్లు! ఇవన్నీ మనం దాచేసినా దాగని సత్యాలు! ఇవన్ని నిజానికి... మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు అని అన్నారు. ఇలాంటి సమాధానాల అన్వేషణే ఆంధ్రప్రదేశ్ లో మన మూడేళ్ల పాలన అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

మనమంతా నిజాయితీగా ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ఈ విలువైన సందర్భంలో  ప్రస్తావిస్తున్నాను: సీఎం జగన్‌

  • ఆహారాన్ని పండించే రైతు అర్ధాకలితో ఉండటాన్ని...
  • భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించటాన్ని...
  • గవర్నమెంటు బడికి వెళ్ళే పేదల పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని...
  • ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్ళుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల్ని... - వైద్యం ఖర్చు భరించలేక, అమ్ముకునేందుకు ఏమీలేక... అప్పటికే అప్పులపాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని...
  • చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లటాన్ని... ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని...
  • కార్పొరేట్ విద్యా సంస్థల కోసం, అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలి పెట్టటాన్ని...
  • మనలో సగం ఉన్న అక్కచెల్లెమ్మలకు, వారి వాటాగా సగం ఉద్యోగాలు, సగం పదవులు, చట్ట సభల్లో సగం స్థానాలు కేటాయించకపోవటాన్ని... -
  • కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో, పరిపాలనలో ఏనాటికీ వాటా దక్కకపోవటాన్ని...
  • సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా, అధికార కేంద్రాలన్నీ ఒకే చోట ఉండాలన్న వాదనల్ని... 
  • గ్రామాల్లో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని, రైతుల్ని గాలికి వదిలేయటాన్ని...
  • ప్రతి పనికీ లంచాలు, కమిషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని...
  • ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు చేసిన నష్టాన్ని...

ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ, మన స్వతంత్ర దేశంలో... మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే... మన ప్రజలకు అన్యాయం చేస్తూ దాన్నే పరిపాలన అంటాడని... ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన మీడియా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని మన స్వాతంత్య్ర సమర యోధులు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా?

ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాలనుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాలనుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు... మనందరి ప్రభుత్వంలో, గత మూడేళ్ళ పాలనతో... సాధ్యమైనంత మేరకు, శక్తి వంచన లేకుండా... సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను!

మన గ్రామానికి, మన నగరానికి అందే పౌర సేవల్లో మార్పులు తీసుకువచ్చాం
1వ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్మాణింగ్ చెప్పి మరీ... ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, 2.7 లక్షల మంది వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళే వ్యవస్థ ఏర్పాటు చేశాం! -

ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే గ్రామ/వార్డు సచివాలయం; అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు... అక్కడినుంచి మరో నాలుగు అడుగులు వేస్తే కనిపించే వైఎస్సార్‌ విలేజి క్లినిక్లు... ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లీష్ మీడియం స్కూల్...

మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లీష్ లో బోధించే ప్రీ ప్రెమరీలు, ఫౌండేషన్ స్కూళ్ళు... ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి పీహెచ్సీకీ ఒక అధునాతన 104... అందులో ఇద్దరు డాక్టర్లు; వీరిని విలేజి క్లినిక్తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్...
ఇవన్నీ గడచిన 75 ఏళ్ళలో కాదు... కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం తీసుకువచ్చిన మార్పులు!

పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ...
గ్రామాలూ నగరాల్లో మార్పులే కాక, గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే... మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని... ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ఠ బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం.
ఇదీ... ఈ మూడేళ్ళలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు!

 అన్నంపెట్టే రైతన్నకు అండగా... వ్యవసాయానికి సాయంగా...
వైఎస్సార్‌ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ. 13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలో తీసుకువచ్చి... ఈ-క్రాప్ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్ లో నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ అందించటం, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు నాణ్యమై ఉచిత విద్యుత్తు వంటివి అందిస్తూ... ఈ మూడేళ్లలో రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మనం చేసిన ఖర్చు... ఏకం రూ. 83 వేల కోట్లు! ఇది కాక, ధాన్యం సేకరణమీద చేసిన వ్యయం మరో రూ. 44 వేల కోట్లకు పైగానే! మొత్తంగా ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం కేవలం వ్యయవసాయం మీద చేసిన ఖర్చు ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లు. -ఫలితంగా, అంతకు ముందు పాలన అయిదేళ్ళతో పోలిస్తే మన మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 16 లక్షల టన్నులు పెరిగింది!
ఇదీ... ఈ మూడేళ్ళలోనే మనందరి ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు!

72 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత, మూడేళ్ల క్రితం... ఒక శాచురేషన్ పద్ధతిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తే... ఏకంగా 31 లక్షల ఇల్లు కుటుంబాలకు... అంటే దాదాపు 1.25 కోట్ల జనాభాకు... సొంత లేదని తేలింది! వీరందరికీ ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో అక్కచెల్లెమ్మల పేరుమీద ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఇప్పటికే నిర్మాణమవుతున్నాయి.

ఈ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయిన తరువాత ఒక్కో ఇంటి విలువా కనీసం రూ.7 నుంచి 10 లక్షలు ఉంటుందనుకుంటే... ఈ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల నుంచి - రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం.
ఇదీ... ఈ మూడేళ్ళలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన ఇంకో మార్పు!

పేదల తలరాతలు మార్చాలనే లక్ష్యంతో..
పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తల రాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో... రూపం మార్చుకున్న అంటరాని తనాన్ని తుద ముట్టించాలన్న నిశ్చయంతో... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్ళుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డి విరుస్తూ... గవర్నమెంటు బడులన్నింటిలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతోపాటు... చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ... జగనన్న అమ్మఒడి పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నాం. ఇవి కాక, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి- నాడు నేడు, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ సంస్థతో ఒప్పందం - 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన... ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకు వస్తున్న ప్రతి మార్పు వెనకా... మన రాష్ట్రంలోని పిల్లలందరి భవిష్యత్తు పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది! ఇలా ఈ మూడేళ్లలోనే విద్యారంగం మీద చేసిన వ్యయం ఏకంగా రూ.53 వేల కోట్లకు పైనే!
ఇదీ... ఈ మూడేళ్ళలోనే విద్యారంగంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు

మరో మంచి మార్పు!
మన వైద్యం-ఆరోగ్యం కోసం... వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. రూ.1000 ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వీటిని ఈ నెలలోనే 3,133కు పెంచుతున్నాం. ఆపరేషన్ తరవాత రోగులు కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5000 వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1088 వాహనాల్ని ప్రతి మండలానికీ పంపాం.

వీటిని మరింతగా పెంచుతూ మరో 432 వాహనాలను పంపనున్నాం. గ్రామ గ్రామానా వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు అవుతున్నాయి. వీటితో పీహెచ్సీలు అనుసంధానమై గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆసుపత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను నిర్మాణం చేస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో రూ.16,000 కోట్లతో నాడు-నేడు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాలా 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం.
ఇదీ... ఈ మూడేళ్ళలోనే... వైద్య ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పు

ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు!
ఒకవంక ప్రభుత్వ బడుల్ని, మరో వంక ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుదిద్దటమే కాకుండా... ఈ మూడేళ్లలోనే మొత్తంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తంగా గత మూడేళ్లలోనే 1.84 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలతోపాటు; 20 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు; 4 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వీరంతా మన కళ్ళ ఎదురుగానే గ్రామ/వార్డుసచివాలయాల్లో కనిపిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులుగా కనిపిస్తారు. మెరుగుపరుస్తున్న కనిపిస్తారు. ఔట్ సోర్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపిస్తారు. గ్రామ/వార్డు వాలంటీర్లుగా ఉద్యోగులుగా కూడా మన కళ్ళెదుటే కనిపిస్తారు!

అంతే కాకుండా, దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, ప్రభుత్వ రంగంలో మరో నాలుగు సీ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఎంఎస్ఎంఈ రంగాన్ని నిలబెడుతూ... లక్షల మంది ఉపాధికి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇదీ... ఈ మూడేళ్ళలో మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మరో మార్పు!

మహిళా సాధికారతకు పెద్దపీట
21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత అంశంలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు వేస్తున్నాం. 44.5 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు మంచి జరిగేలా ఈ మూడేళ్లలోనే జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ. 19,618 కోట్లు; వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల కోట్లు,  డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.12,758 కోట్లు; వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 1కోటీ 2లక్షల అక్క చెల్లెమ్మలకు రూ.3,615 కోట్లు అందించాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.96 లక్షల మంది 45-60 మధ్య వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే అందించిన లబ్ధి - 9,180 కోట్లు! వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా మరో రూ. 1492 కోట్లు; వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా రూ. 589 కోట్లు ఇప్పటికే అందజేయటం జరిగింది.

ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో, ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో టై-అప్లద్వారా, అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం.

అంతే కాకుండా, అక్కచెల్లెమ్మలకు ఆలయ బోర్డులనుంచి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు... ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ; నామినేషన్ కాంట్రాక్టుల్లోను 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసిమరీ అమలు చేసిన ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వం మాత్రమే.

దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ల నియామకం... ప్రతి 2000 జనాభాకూ మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ నియామకం... ఇవన్నీ మహిళా రక్షణ పరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు. 
ఇవీ... ఈ మూడేళ్ళలోనే అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా దన్నుగా ఉంటూ మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన వ్యవస్థాపరమైన మార్పులు!

ఇక సామాజిక న్యాయం విషయానికి వస్తే...
మన మూడేళ్ల పాలనలోనే... ఏపీ రాష్ట్ర చరిత్రలోగానీ, బహుశా దేశ చరిత్రలోగానీ ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించనంతటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా న్యాయాలను మనందరి ప్రభుత్వంలో చేసి చూపించాం!

మంత్రి మండలినే తీసుకుంటే... మొదటి విడత 56 శాతం, రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. ... -

అలాగే, రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు (80%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించాం.

శాసనసభ స్పీకర్గా ఒక బీసీ; శాసన మండలి చైర్మన్గా ఎస్సీని నియమించటమే కాకుండా; శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ మైనార్టీ చెల్లెమ్మకు ఇవ్వటం కూడా సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.

ఈ మూడేళ్లలో రాజ్యసభకు మనం 8 మందిని పంపితే, అందులో నలుగురు బీసీలు. శాసన మండలికి అధికార పార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారే!

పరిషత్ ఎన్నికల్లో 13కు 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ దక్కించుకుంటే, వీటిలో చైర్‌ పర్సన్‌ పదవుల్లో తొమ్మిది (70%) , ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం.

ఎస్సీ-నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనదే!

ప్రభుత్వ కార్పొరేషన్ల 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, వివిధ బీసీ, మైనార్టీలకు మొత్తం 58% పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. -ఇవి కాక, 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషను నియమించిన ప్రభుత్వం కూడా మనదే!
ఇవీ... ఈ మూడేళ్ళలోనే... సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకు వచ్చిన మార్పులు!

ఇవన్నీ ఒకరిద్దరు వ్యక్తులకో, కొద్దిమంది వ్యక్తులతో ప్రయోజనం కల్పించేందుకు చేసిన మార్పులు కావు. ఇవన్నీ వ్యవస్థనే మార్చే మార్పులు. ఇవన్నీ వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, మహిళల అభ్యుదయాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని నిర్ణయించే మార్పులు!

ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం నిన్నటి కంటే నేడు... నేటి కంటే రేపు... రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే రాష్ట్ర అభివృద్ధి అని... అదే మన స్వతంత్రానికి అర్థం అని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు... అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని నమ్మి, ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్ విధానాన్ని అమలు చేశాం.

కాబట్టే, రూ. 1.65 లక్షల కోట్లు... ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష, ఎలాంటి కమిషన్లు లేకుండా... అర్హులందరి ఖాతాలకూ వెళ్ళాయి! బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదార్లకు చేరటం కనీవినీ ఎరుగనిది!

సంక్షేమ పథకాలను మానవ వనరులమీద పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, కుటుంబాల పేదరికం సంకెళ్ళను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రతిపథకాన్నీ కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎసీజీ) సాధించేలా అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి... ఈ మూడేళ్ల కాలంలోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నాం.

అధికారం ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవటానికి మన ప్రభుత్వాలు, వాటి ఉపయోగపడాలన్న మహాత్ముడి మాటల్ని 1947 ఆగస్టు 15న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఉటంకించిన విషయాన్ని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

The ambition of the greatest man of our generation has been to wipe "every tear from every eye."

That may be beyond us, but so long as there are tears and suffering, so long our work will not be over. 

ఈ భావాలను మనసా వాచా కర్మణా... త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం.

ప్రజాస్వామ్యానికి అర్థం చెపుతూ, ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ, గడపగడపకూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మనందరి ప్రభుత్వం... మన సమాజంలో వెనకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశంమీదా సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ...

గొప్పదైన దేశానికి, దేశ ప్రజలకు ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ... దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికీ కలకాలం ఉండాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement