
సాక్షి, తాడేపల్లిగూడెం : వలలో చిక్కుకున్న ఓ కొండ చిలువకు పశు వైద్యాధికారి చికిత్స చేసి కాపాడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. జీలుగుమిల్లిలో శ్రీను అనే రైతు పొలానికి ఆనుకున్న ఉన్న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వల వేశారు. అందులో 12 అడుగుల కొండ చిలువ చిక్కడంతో వారు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. వలలో చిక్కుకున్న కొండచిలువను గుర్తించిన శ్రీను ఈ విషయాన్ని జంగారెడ్డిగూడెం స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు క్రాంతికి తెలిపారు. అక్కడకు చేరుకున్న క్రాంతి గాయలుపాలైన కొండ చిలువను పట్టుకుని ప్రాథమిక చికిత్స చేశారు.
అనంతరం స్థానిక పశు వైద్యశాలకు తీసుకు వెళ్లారు. కొండచిలువకు చికిత్స చేసిన పశు వైద్యులు తీవ్రంగా గాయం కావడంతో పదిరోజుల పాటు వైద్యం చేయాల్సి ఉందని తెలిపారు. అప్పటి వరకూ దాన్ని తాను సమరక్షిస్తూ, వైద్యం చేయిస్తానని క్రాంతి తెలిపారు. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణలో అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు.
మరో కొండచిలువ కలకలం
కాగా భీమడోలు శివారు లింగంపాడు గ్రామం వద్ద పంట కాలువలో కొండచిలువ కలకలం రేపింది. 10 అడుగుల కొండచిలువ చేపల వలలో చిక్కింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment