జరిగిన ఘటనపై విచారణాధికారికి లిఖితపూర్వకంగా నివేదిస్తున్న బాధిత బాలిక ఉదయశ్రీ
కాకినాడ క్రైం: రామచంద్రపురం డివిజన్ పరిధి కుందూరు పీహెచ్‌సీలో ఓ బాలికకు 2015లో అటెండర్ వైద్యం చేయడంతో చూపు కోల్పోయిన ఘటనపై శనివారం కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విచారణ జరిగింది. రాష్ట్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనీల్ సింఘాల్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో విచారణాధికారిగా జోన్–1 ఆర్‌డీఎంహెచ్‌ఎస్ జి.సావిత్రి, సహాయ విచారణాధికారిగా జోన్–1 ఇన్‌చార్జి డీడీ శ్రీనివాస్‌కుమార్ వ్యవహరించారు. చార్జి మెమోలు పొందిన వారిలో నాటి డీఎంహెచ్‌ఓ ఎం.సావిత్రమ్మ, స్టాఫ్ నర్సులు జె.ఉమా, వి.సుగుణ, ఎస్‌పీహెచ్‌ఓ దుర్గాప్రసాద్, మెడికల్ అధికారి బీజే ప్రవీణతో పాటు ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) ఎస్.ప్రవల్లిక ఉన్నారు. ఆ ఆరుగురి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నామని సావిత్రి తెలిపారు. కుడి కన్ను కోల్పోయిన బాలిక గొల్లపల్లి ఉదయశ్రీ నాటి ఘటనపై లిఖిత పూర్వక సమాచారాన్ని అందించిందన్నారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
జరిగింది ఇదీ..
2015 జనవరి 22న జరిగిన ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఆ రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కుందూరు పీహెచ్‌సీకి కంట్లో బురద నీరు పడటంతో అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ఉదయశ్రీ కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు గానీ అందుబాటులో లేరు. అక్కడే ఉన్న ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా పనిచేస్తున్న ఎస్.ప్రవల్లిక వైద్యం చేయాలని సిద్ధపడింది. సిరంజీకి సూదిగుచ్చి తోచిన వైద్యం చేయడానికి పూనుకుంది. ఈ క్రమంలో ఆ సూది నేరుగా బాలిక కుడి కంట్లో దిగబడిందని చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావమై ఉదయశ్రీ తన కుడి కన్నును కోల్పోయింది. అప్పటి కలెక్టర్ అరుణ్‌కుమార్ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. ప్రవల్లికతో పాటు అప్పటి డీఎంహెచ్‌ఓ, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎస్‌పీహెచ్‌ఓ, ఎంఓపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే వైద్యాధికారి ప్రవీణ అధికారిక పనులతోనే బయటకు వెళ్లడంతో క్రిమినల్ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఈ ఘటనపై ఇప్పటికే ఆర్డీఓ, కలెక్టర్ విచారణలు జరగ్గా శనివారం శాఖాపరమైన విచారణ పూర్తయింది.
చదవండి: జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment