సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్‌టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం.
260 టన్నుల బరువు..
పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు.
రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్‌ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment