
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. నిర్మాణంలోని ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గతేడాది అక్టోబర్ 6న ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని షెకావత్ లేఖల్లో పేర్కొన్నారు. తెలంగాణలో కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టేందుకు లేదా కొనసాగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి తప్పనిసరని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. గతేడాది డిసెంబర్ 11న సీఎం కేసీఆర్‌తో భేటీ అయి న సందర్భంగా డీపీఆర్‌లు సమర్పించాలని కోరినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఒక్క డీపీఆర్ కూడా సమర్పించలేదని తెలిసిందని లేఖలో షెకావత్ పేర్కొన్నారు. కృష్ణా నదిపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ప్రభుత్వం వెంటనే సమర్పించాలని సూచించారు.