Jamdani Sarees: Famous In Payakaraopeta To Visakhapatnam - Sakshi
Sakshi News home page

Jamdani Sarees: పాయకరావుపేటలో తళుక్కు.. జమధాని సొగసు 

Published Mon, Dec 6 2021 12:17 PM | Last Updated on Mon, Dec 6 2021 1:48 PM

Jamdani Sarees Famous In Payakaraopeta To Visakhapatnam - Sakshi

పువ్వు వంటి పడుసు.. నవ్వుతూ సింగారిస్తే.. ఏచీరకు ఎంతందము ఎదురొచ్చెనో తెలియక సిక్కొచ్చి పడ్డాదిలే.. సిన్ని రామసిలక.. అంటూ బంగారిమామ పాటలా.. ఈ చీరల సొగసు చూస్తే పాడాలనిపిస్తుంది.. ఎవరికైనా..! తళుక్కుమనే జమధాని చీరల తయారీలోప్రసిద్ధి పొందిన పాయకరావుపేట చేనేతకార్మికుల కళాత్మకత చూపరులను కట్టిపడేస్తుంది.. 

పాయకరావుపేట: జమధాని చీరల తయారీ రోజురోజుకీ కొంగొత్త అందాలను సంతరించుకుంటుంది. పట్టణంలో సుమారు 300 కుటుంబాలు చీరల తయారీలో ప్రావీణ్యం పొంది ఉన్నారు. సుమారు 110 చీరలు తయారు చేసే మగ్గాలు ఉన్నాయి. పాయకరావుపేట జమధాని చీరలకు మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. 1994 నుంచి ఇక్కడ జమధాని చీరలు తయారు చేస్తున్నారు.  

ఇదీ ప్రత్యేకత.. 
ఆల్‌ ఓవర్, బోర్డర్‌ డిజైన్, పల్లా బుట్టా అనే ప్రధాన రకాల జమధాని చీరలు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. పూర్తి డిజైన్‌తో ఖరీదైన చీరలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. అంచులతో, ఆల్‌ఓవర్‌ డిజైన్‌ చీరలు ఎంతో ఆకట్టుకుంటాయి. 

చీరకు పది రోజులు... 
మగ్గానికి ముగ్గురు చొప్పున చీరను తయారు చేయడం ప్రారంభిస్తే పూర్తికావడానికి సుమారు 10 రోజులు పడుతుంది. అదే విధంగా నెలకు కేవలం 300 వరకు ఇక్కడ ప్రత్యేకమైన చీరలను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన చీరలను హైదరాబాద్, ముంభై, ఢిల్లీ, విశాఖపట్నం, శ్రీకాకుళం, బెంగుళూరు, చెన్నైకి ఎగుమతి చేస్తుంటారు. సుమారుగా రూ.3500 నుంచి రూ. 7000 వరకు ఖరీదు గల చీరలు ఇక్కడ నుంచి ఎగుమతి అగుతున్నాయి. 

తయారీ, మార్కెటింగ్‌ ఇలా
జమధాని చీరల తయారీకి ముడి సరకు విజయవాడ నుంచి వస్తుంది. నేషనల్‌ డెవలప్‌మొంట్‌ కార్పొరేషన్‌ సరఫరా చేస్తుంది. మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని తయారీదారులు కోరుతున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న చీరలు మార్కెట్‌లో అమ్మకాలు సాగించుకోవలసి వస్తుంది. పాయకరావుపేటలో తయారైన జమధాని చీరలు ఢిల్లీ, బెంగలూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోని పెద్ద పెద్ద షాపులకు వెళ్తున్నాయి. పట్టు, ముడి నూలు రేటు పెరగడం కారణంగా అధిక సంఖ్యలో చీరలు తయారు జరగడం లేదు. నెలకు చేనేత కార్మికురాలు ఆరు చీరలు తయారు చేస్తారు.

నెలకు రూ.6 వేలు వరకు మజూరి వస్తుంది. రూ.3 వేల నుంచి రూ. 25 వేలు వరకు ధరల్లో చీరలు తయారు చేస్తున్నారు. ప్రతి నెలా 100 చీరలు వరకు ఇక్కడ నుంచి ఆర్డర్ల మేరకు దుకాణాలకు పంపించడం జరుగుతుంది.  చీరల తయారీకి ఆప్‌కో ద్వారా రాయితీలు కల్పించలేదు. ఆప్‌కో సంస్థ ద్వారా రాయితీలు, ముడి సరకు సరఫరా చేస్తే ఎక్కువగా చీరలు తయారీకి, ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

పట్టు, నూలు రేటు పెరిగింది 
జమధాని చీరల తయారీకి అవసరమైన పట్టు, నూలు రేటు పెరిగింది. ఆప్కో సరఫరా చేయడం లేదు. ఎగుమతులు కూడా తగ్గాయి. తయారీ దారులు ఉన్నారు. ముడి సరుకు సరఫరా జరగడం లేదు. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. 
 –రొబ్బి సుబ్రమణ్యం, జమధాని చీరల టెక్నికల్‌ మాస్టర్, పాయకరావుపేట 

ముడి సరుకు ఇస్తే మేలు 
చీరలు తయారు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల సరిపడా ఆదాయం లేదు.  ముడి సరకు సరఫరా చేస్తే చీరలు పెద్ద మొత్తంలో తయారు చేసే వీలుంది. ఇక్కడ చీరల తయారీ దారులు ఎక్కువగానే ఉన్నారు. ముడి సరుకు సరఫరా కాక ఉపాధి కరువైంది. 
–అల్లంక భ్రమరాంబ, చీర తయారు చేసే మహిళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement