తాజాగా జనసేన కార్యాలయం వద్ద టు లెట్ బోర్డు
పార్టీ కార్యాలయం మూసివేత
టు లెట్ బోర్డు పెట్టిన భవనం యజమాని
కార్యాలయం అద్దె చెల్లించకపోవడమే కారణం?
పొత్తుల వల్ల సీట్లు దక్కకపోవడంతో స్థానిక నేతల ఆగ్రహం
కార్యాలయం ఖర్చు, అద్దె కూడా వృథా అని భావన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.
ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్‌రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం.
ఇది రెండోసారి
జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్‌లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment