AP: వైద్య శాఖలో కొలువుల జాతర | Job Recruitment In AP Medical Health Department | Sakshi
Sakshi News home page

AP: వైద్య శాఖలో కొలువుల జాతర

Published Thu, Dec 8 2022 7:51 AM | Last Updated on Thu, Dec 8 2022 12:51 PM

Job Recruitment In AP Medical Health Department - Sakshi

వైద్య, ఆరోగ్య శాఖలో ఒక్క పోస్టు భర్తీ చేయాలంటే గతంలో సంవత్సరాల కాలం పట్టేది. వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు, నర్సింగ్‌ శిక్షణ పొందిన వారు, వివిధ టెక్నీషియన్లు నోటిఫికేషన్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి వైద్యశాఖలో కొలువుల జాతర కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యరంగంలో ఎక్కువగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వైద్య ఆరోగ్యశాఖలో నిత్యం ఏదో ఒక పోస్టుకు నోటిఫికేషన్‌ వస్తోంది. 

కర్నూలు (హాస్పిటల్‌): వైద్యరంగంలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికితోడు అవసరమైన అదనపు పోస్టులనూ సృష్టించి మరీ భర్తీ చేసింది. ముందుగా జిల్లాలో వెయ్యికి పైగా ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎంలను నియమించి వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించింది. వీరు సచివాలయాల పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించడమే గాక ప్రాథమిక చికిత్సను సైతం అందిస్తున్నారు. గ్రామాల్లో వారి పరిధిలోకి వచ్చే ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.

 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 600 మందికి పైగా బీఎస్సీ నర్సింగ్‌ విద్యను పూర్తి చేసిన నర్సులు మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లుగా వైద్యుల పాత్ర పోషిస్తున్నారు. ఆయా గ్రామాలకు వైద్యపరంగా వారే పెద్ద దిక్కుగా మారారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గ్రామస్తులు వారి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్య సమస్య వారి పరిధిలో లేకపోతే టెలీమెడిసిన్‌ ద్వారా పీహెచ్‌సీ లేదా జిల్లా కేంద్రంలోని టెలీమెడిసిన్‌ హబ్‌కు వీడియోకాల్‌ చేసి మరీ వైద్యం అందేలా చేస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న జబ్బులకు జిల్లా కేంద్రాలకు వెళ్లి వైద్యం చేయించుకునే వ్యయప్రయాసలను తగ్గించారు.

 గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 మాత్రమే అర్బన్‌హెల్త్‌ సెంటర్లు ఉండేవి. వాటిని 40కి పెంచడమే గాక అందులో పోస్టులను సైతం ప్రభుత్వమే భర్తీ చేసి నిర్వహిస్తోంది. గ్రామాల్లో పీహెచ్‌సీల మాదిరిగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆయా పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌లు ఇలా అన్ని ఆరోగ్య కేంద్రాలకు కలిపి గత రెండేళ్ల నుంచి 600లకు పైగా స్టాఫ్‌నర్సులను నియమించారు. దాంతో పాటు మరో 200 మంది ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల పోస్టులను భర్తీ చేశారు. 200లకు పైగా నాల్గవ తరగతి ఉద్యోగులనూ నియమించారు. వీరితో పాటు మరో 200 మంది దాకా పారామెడికల్‌ ఉద్యోగుల నియామకాలు చేపట్టారు.  

పెద్దాసుపత్రిలో భారీగా నియామకాలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాదిలో 385 పోస్టులు వివిధ కేడర్లలో భర్తీ అయ్యాయి. అందులో స్టాఫ్‌నర్సులు 298, గ్రేడ్‌–2 ఫార్మాసిస్టు 15, రిసెప్షనిస్టు కమ్‌ క్లర్క్‌ 3, చైల్డ్‌ సైకాలజిస్టు 1, ఫిజియోథెరపిస్ట్‌ 2, థియేటర్‌ అసిస్టెంట్‌ 6, గ్రేడ్‌–2 ల్యాబ్‌టెక్నీషియన్‌ 19, రేడియోగ్రాఫర్‌ 1, డేటా ఎంట్రీఆపరేటర్స్‌ 3, బయోమెడికల్‌ ఇంజనీర్‌ 1, రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌ 1, కార్డియాలజి టెక్నీషియన్‌ 1, డెంటల్‌ టెక్నీషియన్‌ 1, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ 4, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ 1, ఎక్స్‌రే అటెండెంట్‌ 1, ఆప్టోమెట్రిస్ట్‌ 1, కేథలాబ్‌ టెక్నీషియన్‌ 2, స్పీచ్‌థెరపిస్ట్‌ 2, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌ 2, సీటీ టెక్నీíÙయన్‌ 2, డయాలసిస్‌ టెక్నీషియన్‌ 5, ఆడియోమెట్రి టెక్నీషియన్‌ 1, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ 4, స్ట్రెచ్చర్‌ బేరర్‌ 6, అటెండర్‌ 2 పోస్టులున్నాయి.  

కేఎంసీలో భారీగా వైద్యుల నియామకం 
కర్నూలు మెడికల్‌ కాలేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైద్యుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్న వైద్యులను బదిలీ చేసింది. అనంతరం అర్హులైన వైద్యులకు పదోన్నతులు కల్పించింది. ఇందులో భాగంగా 32 మందిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా, 22 మందిని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు ఖాళీగా ఉన్న స్థానాల్లో వారిని భర్తీ చేసింది. ఈ క్రమంలో గతంలో కర్నూలు నుంచి బదిలీ అయిన వారు తిరిగి పదోన్నతిపై ఇక్కడికే వచ్చారు. దీంతో పాటు ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసింది. ఈ ఏడాది ఏకంగా 123 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నూతన వైద్యులు కర్నూలు మెడికల్‌ కాలేజిలో అడుగు పెట్టారు. దీంతో ప్రస్తుతం వైద్యుల సంఖ్య ప్రొఫెసర్లు 73, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 69, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 224 మంది ఉన్నారు. దీంతో కళాశాలలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి ఆయా విభాగాలకు 41 పీజీ సీట్లు అదనంగా మంజూరయ్యాయి. ఇందులో రెండు సూపర్‌స్పెషాలిటీ విభాగాలు కూడా ఉన్నాయి.  

ఎంతో ఆనందాన్ని ఇస్తోంది 
నేను కర్నూలు వాసినే. జనరల్‌ మెడిసిన్‌ను 2019లో బెంగళూరులోని వైదేహి యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి చేశాను. ఎండీ పూర్తి చేసినప్పటి నుంచి ప్రభుత్వ సరీ్వసులో చేరాలన్నది ఆశ. ఇందుకోసం అప్పటి నుంచి మూడుసార్లు ప్రయత్నం చేశాను. అయితే మెరిట్‌ ఉన్నా నాకు సీటు రాలేదు. ఈసారి పోస్టులు ఎక్కువగా ఉండటంతో నాకు అవకాశం దక్కింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎంతో గొప్పది. ఎంతో మంది సీనియర్‌ వైద్యులు, ఎక్కువ మంది స్టాఫ్‌ ఉన్నారు. వీరి మధ్య పనిచేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది.  
– డాక్టర్‌ కె. దివ్యశ్రీ హర్షల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 

మంచి పరిణామం 
ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో భారీ ఎత్తున నియామకాలు చేపడుతోంది. ఇది వైద్యరంగానికి మంచి పరిణామం. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి ఒక్కరోజులో వందలాది మందిని నియామకం చేయడం చాలా ఖర్చు, కష్టంతో కూడుకున్న పని. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. నాది వైఎస్సార్‌ జిల్లా బద్వేలు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో డీఎన్‌బీ ఆరేళ్లు పూర్తి చేశాను. 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తుండగా ఇప్పటికి కలనెరవేరింది. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉండి వైద్యం చేయడం కన్నా మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య ఉండి వారికి సేవలందించడం ఎంతో ఆనందంగా ఉంది.  
– డాక్టర్‌ కె. రవీంద్ర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల

రోగులకు ఎంతో మేలు జరుగుతోంది 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గతంలో ఎప్పుడూ ఇన్ని పోస్టులు ఒకేసారి భర్తీ కాలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పోస్టులు సైతం భర్తీ అయ్యాయి. ఈ కారణంగా రోగులకు ఆయా విభాగాల్లో ఉత్తమ వైద్యసేవలు అందించేందుకు వీలు కలుగుతోంది. ఎక్కడా ఖాళీలు ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదరోగులకు మేలు జరుగుతోంది.   
– డాక్టర్‌ జి. నరేంద్రనాథ్‌రెడ్డి, 

సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు 
వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలువైద్యరంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా పోస్టులు ఖాళీగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో దాదాపుగా అన్ని పోస్టులు భర్తీ అయ్యాయి. గత రెండేళ్లుగా మా శాఖలోని ఉద్యోగులు వరుసగా వస్తున్న నోటిఫికేషన్‌లలోనే ఎక్కువశాతం బిజీగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  
– డాక్టర్‌ బి. రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement