వైద్య ఆరోగ్య శాఖలో 39 వేల ఉద్యోగాలు | 39 thousand jobs in medical health department at Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్య శాఖలో 39 వేల ఉద్యోగాలు

Published Thu, Feb 3 2022 3:48 AM | Last Updated on Thu, Feb 3 2022 8:27 AM

39 thousand jobs in medical health department at Andhra Pradesh - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జిల్లాలోని బోధనాస్పత్రి నుంచి ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌ వరకు 100 శాతం రిక్రూట్‌మెంట్‌ పూర్తి కావాలి. డాక్టర్లు లేరు.. నర్సులు లేరు.. పారా మెడికల్‌ సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు. ఈ విషయంలో మార్చి 1 నుంచి కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులదే బాధ్యత. బదిలీలు, నియామకాలు వెంటనే పూర్తి చేయండి. మనం ఇక్కడ ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. సానుభూతితో వ్యవహరిస్తే చాలా వరకు సమస్యలు తీరుతాయి.        
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, సిబ్బంది సహా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖలో 39 వేల మందిని నియమిస్తున్నామని, ఇందులో ఇప్పటి వరకు 27 వేల మందిని రిక్రూట్‌ చేశామన్నారు. మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా నియమించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన కోవిడ్‌ నియంత్రణ, వైద్య సిబ్బంది నియామకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిబ్బంది హాజరు, విధులు నిర్వర్తించడం, ఆస్పత్రులకు అందుబాటులో ఉండడం అన్నీ సక్రమంగా జరగాలన్నారు. ప్రతి శాఖలోనూ ఇది అమలు కావాలని, తద్వారా 90 శాతం సమస్యలు తీరిపోతాయని చెప్పారు. ఇందు కోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రెండు వారాలు కీలకం
► మనం కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నాం. వచ్చే రెండు వారాలు కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలు, జాగ్రత్తలు పాటించడంతో పాటు ఆంక్షలు కచ్చితంగా అమలు చేయడం అత్యంత కీలకం. ఈ రెండు వారాల్లో ఒమిక్రాన్‌ తీవ్రత గరిష్ట స్థాయికి చేరి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
► రికవరీ రేటు ప్రస్తుతం 94.72 శాతం ఉంది. కొద్ది రోజుల క్రితం గరిష్టంగా 36.02 శాతం ఉన్న పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 17.73 శాతం ఉంది. కోవిడ్‌ నివారణ కోసం ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నాం. 
► నైట్‌ కర్ఫ్యూ, మాస్క్‌ ధరించకపోతే ఫైన్‌ విధించడం, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడకుండా చూడడం, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లో కోవిడ్‌ నిబంధనలు, భౌతిక దూరం పాటించేలా చూడాలి. 

104 వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ 
► ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఫీవర్‌ సర్వేను కొనసాగించండి. సర్వే చేస్తున్న తీరును కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఫీవర్‌ సర్వేలో వ్యాక్సినేషన్‌ ఒక భాగం కావాలి. వ్యాక్సినేషన్‌ విషయంలో కలెక్టర్లు సమర్థవంతంగా పనిచేశారు. వారికి నా అభినందనలు. లక్షణాలు ఉన్న వారికి వెంటనే టెస్టులు చేసి, అవసరమైన వారికి చికిత్స అందించాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందులు ఇవ్వాలి. హోం ఐసోలేషన్‌ అవకాశం లేకపోతే వారిని అన్ని సదుపాయాలు కల్పించి, కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించాలి. 
► కోవిడ్‌ సమస్యలకు 104 సెంటర్‌ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. 104 మీద ప్రతి కలెక్టర్‌ ప్రతి రోజూ సమీక్ష చేయాలి. వచ్చే కాల్స్‌ పట్ల, స్పందిస్తున్న తీరుపై రివ్యూ చేయాలి. 1,05,930 మందికి పాజిటివ్‌ ఉంటే.. అందులో 2,286 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్‌ కేసుల్లో కేవలం 2.16 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇందులో కేవలం 1.29% మంది మాత్రమే ఆక్సిజన్‌ స్థితికి వెళ్తున్నారు. 
► 100 శాతం మొదటి డోస్, 91 శాతం మందికి రెండు డోసులు వేశారు. 15–18 ఏళ్ల వారికి 100 శాతం మొదటి డోస్‌ పూర్తి చేశారు. 60 ఏళ్ల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రికాషనరీ డోస్‌ను వేగవంతం చేయాలి. 45 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు అందించే విషయంలో కాల పరిమితిని తగ్గించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. 

జూన్‌ 30 నాటికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ 
► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ 30 నాటికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. జూలై 1 నాటికి కొత్త పీర్సీ మేరకు సవరించిన కొత్త జీతాలు వారికి అందాలి. మిగిలిపోయిన 25 శాతం ఉద్యోగులు కూడా ప్రొబేషన్‌ పరీక్షలు పూర్తి చేసేలా తగిన శిక్షణ ఇవ్వడం తదితర చర్యలు తీసుకోవాలి.  
► పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశాం. కోవిడ్‌ కారణంగా మరణించిన ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఆలస్యం కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలి. జూన్‌ 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలి. అన్ని విభాగాలూ దీనిపై దృష్టి పెట్టాలి.  

ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంఐజీలో స్థలాలు
► ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించాలని చెప్పాం. ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలి. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలి.
► స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5లోగా రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్న వారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలి. దీనివల్ల డిమాండ్‌ తెలుస్తుంది. స్థల సేకరణకు వీలు ఉంటుంది. సేకరించిన స్థలంలో 5 శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలి. 
► ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి. 
► వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement