సాక్షి, అమరావతి: బీసీల కుల గణనపై కార్యాచరణకు కమిటీని నియమించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. 139 బీసీ కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ఏపీలో బీసీల గణన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశ సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ బీసీ సంఘాల ఆభ్యర్ధన మేరకు బీసీల కుల గణన కార్యాచరణ బాధ్యతను సీఎం జగన్ తనకు అప్పగించారని తెలిపారు. దీనిపై కమిటీని నియమించి ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయం చేస్తామన్నారు. చదువు అనే ఆయుధంతో సమాజంలో గుర్తింపు, గౌరవం సాధించడంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలవగా సీఎం జగన్ వారి ఆశయాలను ఆచరిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. బీసీలకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు వారికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం
దేశంలో పూలే ఆశయాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారేనని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేయలేదన్నారు. సామాజిక న్యాయంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్ విసిరారు. విద్య అనే ఆయుధాన్ని కలిగి ఉంటే సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవచ్చని, ఈ దిశగా విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, పోతుల సునీత, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, అగ్రికల్చరల్ మార్కెటింగ్ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment