
నెల్లూరు (సెంట్రల్): కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం విచారణ జరుపుతున్నట్టు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నోటీసులిచ్చినా విచారణకు హాజరు కాలేదన్నారు.
ఆయన అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదని తెలుస్తోందని తెలిపారు. దీన్ని ధిక్కారం కింద నమోదు చేశామని, దీనిపై చర్చిస్తామన్నారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తనపై వచ్చిన ఆరోపణలను విడిచి పెట్టాలంటూ లేఖ రాశారని, దానిపైనా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.