
సాక్షి, ధర్మవరం/అనంతపురం: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన కామిరెడ్డిపల్లి త్రిబుల్ మర్డర్ కేసులో జిల్లా మహిళా కోర్టు(జిల్లా 4వ అదనపు జడ్జి) న్యాయమూర్తి బి.సునీత గురువారం తీర్పునిచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న 20 మందిపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా పరిగణించారు. వివరాలు.. 2011లో ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు, అతని కొడుకు దాసరి ఆంజనేయులు, కూతురు పద్మావతి కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ కౌన్సిలర్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, అతని చిన్నాన్న కామిరెడ్డిపల్లి ఆదిరెడ్డి, సోదరుడు రవీంద్రారెడ్డి, మల్లాకాల్వ రామమోహన్‌రెడ్డి, రావులచెరువు ప్రతాపరెడ్డి, మరో 17 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 2011 సెప్టెంబర్ 15న కనగానపల్లి పోలీసులు సెక్షన్–324, 326, 307, 302,120బీ కింద కేసు నమోదు చేశారు. ధర్మవరం, అనంతపురం కోర్టుల్లో కేసు నడిచింది. (టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి)
35 మంది సాక్షులను విచారించిన కోర్టు
కేసులో నిందితులుగా మొత్తం 22 మంది ఉండగా, వారిలో మూడేళ్ల క్రితం తిమ్మప్ప, ప్రకాష్ చనిపోయారు. మిగిలిన 20 మందిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. కాగా రెండు నెలల పాటు ఈ కేసును విచారించిన జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి మొత్తం 35 మంది సాక్షులను విచారించారు. వీరితోపాటు అప్పట్లో కేసు నమోదు చేసిన ముగ్గురు పోలీసు అధికారులను కూడా విచారణ చేశారు. నేరం రుజువు కాకపోవడంతో మొత్తం 20 మంది నిందితులను నిర్దోషులుగా తీర్పునిస్తూ న్యాయమూర్తి కేసు కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment