సత్యప్రమాణాల దేవుడు శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సల ఏర్పాట్లకు దేవస్థానం రెండు నెలల ముందే శ్రీకారం చుట్టింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని మహా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం నిర్ణయించింది.
సెప్టెంబర్ 18వ తేదీ వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు నిర్వహించి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీటవేస్తు, ఉభయదారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చిన్న పొరబాటు చోటు చేసుకోకుండా దర్శనం కల్పించేలా ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది.
కాణిపాకం(యాదమరి): కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు రెండు నెలల ముందే తగు ఏర్పాట్లుకు నడుం బిగించారు. గతంలో కంటే ప్రస్తుతం వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. నిత్యం భక్తులు 20 వేలకు పైగా విచ్చేస్తున్నారు.
సెలవురోజుల్లో, పండుగ రోజుల్లో 50 వేలకు పైగా భక్తులు వస్తున్నారు. ఒక్కోసారి దర్శనానికి 6,7 గంటల సమయం కూడా పడుతోంది. బ్రహ్మోత్సల సమయంలో దర్శనం, ఉత్సవమూర్తుల ఊరేగింపు చూసేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులతో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తు పలు అంశాలను చర్చిస్తూ, ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా
గతంలో బ్రహ్మోత్సవాలకు ముందు హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. భక్తులకు ఈ సౌకర్యాలు సరిపోయేవి కావు. దీంతో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రత్యేక క్యూలు, నిత్య అన్నప్రసాదం, లడ్డూ, పులిహోరా ప్రసాదాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి వసతి, వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ దర్శనాలు, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో, ఊరేగింపులో స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నారు.
భక్తులకు సంతృప్తి కలిగించేలా..
శ్రీవినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రాల నుంచి కూడా అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరి కాకుండా రెండు నెలలకు ముందు నుంచే మహా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాం.
సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దర్శనం కల్పిస్తే బాగుంటుందని చర్చిస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు చాలా బాగా దర్శనం చేసుకున్నాం అనే సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేస్తాం. –మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మన్
భక్తులందరికీ నిత్య అన్న ప్రసాదం
ప్రస్తుతం నిత్యాన్నదానంలో 7 వేల మందికి భోజనం పెడుతున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదం అందించాలని భావిస్తున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండాలనే రెండు నెలలకు ముందే ముందస్తు చర్యలు ప్రారంభించాం.
బ్రహ్మోత్సవాలకు వారం ముందే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షిస్తూ సలహాలు తీసుకుంటున్నాం. అన్నిశాఖల అధికారులు, ఉభయదారులతో సమన్వయంగా పనిచేస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తాం –వెంకటేశు, ఆలయ ఈఓ
ఆలయంలో భక్తుల రద్దీ
కాణిపాకం(యాదమరి):కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. స్వామివారి దర్శనార్థం ఉదయం నుంచి భక్తులు తరలి రావడంతో కంపార్ట్‌మెంట్‌లు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment