కుప్పానికి ‘కృష్ణా’ జలాలు  | Krishna River Water For Kuppam By CM Jagan Govt | Sakshi
Sakshi News home page

కుప్పానికి ‘కృష్ణా’ జలాలు 

Published Mon, Feb 26 2024 5:30 AM | Last Updated on Mon, Feb 26 2024 11:57 AM

Krishna River Water For Kuppam By CM Jagan Govt - Sakshi

సీఎం జగన్‌ చేతుల మీదుగా నీటి విడుదలకు రామకుప్పం మండలంలో సిద్ధమైన కెనాల్‌

సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్‌ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు.

ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబె­ట్టుకున్న సీఎం జగన్‌ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజక­వర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. 

అంచనాల్లోనే బాబు వంచన.. 
జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను చేపట్టి.. సాగు, తాగునీరు అందిస్తానని కుప్పం ప్రజలకు 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు దశల్లో ఎత్తిపోసి.. 123.641 కిమీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని ప్రకటించారు.

రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు నీళ్లందించే పథకంలోనూ చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను 123.641 కిమీల పొడవున తవ్వేందుకు మట్టి, కాంక్రీట్‌ పనులకు రూ.203.11 కోట్లు వ్యయం అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్‌మైన్లు, విద్యుత్‌ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.293.11 కోట్లు. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015, మేలో అంచనాలు రూపొందించారు. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే.. టెండర్ల దశలోనే రూ.120 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 

బినామీతో కలిసి యథేచ్ఛగా దోపీడీ.. 
ఇక కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను అప్పటి కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాకు కట్టబెట్టి ఆ రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్‌వేసి 2015, ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్‌ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు రూపొందించారు. దాంతో టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక (ఎక్సెస్‌) ధరకు కోట్‌చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం సింగిల్‌ బిడ్‌ దాఖలైతే ఆ టెండర్‌ను రద్దుచేయాలి. కానీ.. చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆ టెండర్‌ను ఆమోదించి రూ.430.26 కోట్ల పనులను ఆర్కే ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారు.

మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద ఆర్కే ఇన్‌ఫ్రాకు రూ.43 కోట్లు ఇచ్చేలా చక్రం తిప్పిన చంద్రబాబు.. వాటిని ఎవరి జేబులో వేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈ పనులను శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టడంపై చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌ అలకబూనారు. దీంతో50 శాతం పనులను  సీఎం రమే‹Ùకు చెందిన రితి్వక్‌ ప్రాజెక్ట్స్‌కు సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించారు. కానీ.. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డిని వెళ్లగొట్టి మొత్తం పనులను సీఎం రమే‹Ùకు చంద్రబాబు కట్టబెట్టారు. కానీ, రమేష్‌ మట్టి తవ్వకం పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీగా లబ్ధిపొందారు. దోచేసిన సొమ్ములో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వాటాలు పంపారని అప్పట్లో టీడీపీ వర్గాలే కోడై కూశాయి.  

చెప్పారంటే చేస్తాడంతే.. 
వరుసగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిపారు. కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతోపాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను, పోలీసు సబ్‌ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.

ఈ నేపథ్యంలో.. 2022, సెపె్టంబరు 23న కుప్పంలో సీఎం జగన్‌ పర్యటించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్‌ 18న ప్రారంభించారు.    

పాలార్‌ రిజర్వాయర్‌కు శ్రీకారం.. 
కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా కుప్పం మండలం గణేశ్వరపురం వద్ద పాలార్‌ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. రూ.214.81 కోట్లతో పాలార్‌ రిజర్వాయర్‌ పనులు చేపట్టేందుకు శుక్రవారం పరిపాలనా అనుమతినిస్తూ జీఓ జారీచేశారు. ఇందులో రిజర్వాయర్‌ నిర్మాణానికి సర్వే, డీపీఆర్‌ తయారీకి రూ.0.432 కోట్లు.. ముంపునకు గురయ్యే 90 ఎకరాల భూసేకరణకు, 258 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కలి్పంచడానికి, 357.06 ఎకరాల అటవీ భూమికి పరిహారం చెల్లించడానికి రూ.47.878 కోట్లు కేటాయించారు.

దీంతోపాటు.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో అంతర్భాగంగా గుడిపల్లి మండలం యామిగానిపల్లి వద్ద 0.710 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించడం.. శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించే పనులు చేపట్టడానికి రూ.535.435 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జీఓ–100ను ఆదివారం రాత్రి జారీ­చేశారు. వాస్తవానికి.. పాలార్‌ రిజర్వాయర్‌కూ చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇది పూర్తయితే కుప్పంలో తనకు రాజకీయంగా ఉనికిలేకుండా పోతుందని ఆందోళనతో ఆయన తమిళనాడు సర్కారును ఉసిగొల్పి సుప్రీంకోర్టులో కేసులూ వేయించారు.

కుప్పం నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం : పెద్దిరెడ్డి 
శాంతిపురం (చిత్తూరు జిల్లా) :  కుప్పం ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కుప్పం కాలువ పనులను పూర్తిచేసి, సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. వీటితో కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం ఉద్దేశమన్నారు. ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్‌ షన్మోహన్, ఎమ్మెల్సీ భరత్, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలతో కలిసి మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  

రూ.30 కోట్లు అధికంగా చెల్లింపు.. 
ఇక ఈ పనుల్లో సీఎం రమేష్‌ సంస్థకు రూ.460.88 కోట్లను 2019, ఏప్రిల్‌ నాటికి చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే.. కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. పనుల్లో నాసిరకమైన పైపులు వేయడంవల్ల వర్షపు నీటికి ఆ పైపులు పగిలిపోయాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement