చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం , రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేస్తున్న సీఎం జగన్
కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. అలాంటి కుప్పానికి ఆయన చేసింది పెద్ద సున్నా. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. పధ్నాలుగేళ్లు సీఎంగా, ఏడు సార్లు ఎమ్మెల్యేని చేసిన కుప్పం ప్రజలకే మంచి చేయని బాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాంటి మనిషో చంద్రగిరి ప్రజలు ఎప్పడో తెలుసుకున్నారు. కుప్పానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చింది ఎవరంటే.. మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది మీ జగనే.
‘‘చంద్రబాబుకు నామీద కోపం వచ్చినప్పుడల్లా పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. మీ జగన్ ఏనాడూ ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్నిగానీ ఒక్క మాట కూడా అనలేదు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం.. ఏ ప్రాంతమైనా సరే పేదలను పేదలుగానే చూశాం. కుప్పం నియోజకవర్గంలో 82,039 కుటుంబాలకు (93.29 శాతం) నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
– సీఎం జగన్
సాక్షి, తిరుపతి: కనీసం సొంత నియోజకవర్గానికైనా మేలు చేయని రాజకీయ నాయకుడు ఇక రాష్ట్రానికి ఏం ఒరగబెడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సైతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుప్పానికే ప్రయోజనం లేని ఆ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ బాగా ఆలోచన చేయాలని సూచించారు. కరువు తాండవమాడిన కుప్పం నేలకు కృష్ణా జలాలను తరలిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గానికి సోమవారం కృష్ణా జలాలను విడుదల చేశారు.
కుప్పం పరిధిలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం జగన్ వాయువేగంతో పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
మాట నిలబెట్టుకుంటున్నా..
కొండలు, గుట్టలు దాటుకుని ఏకంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1,600 అడుగుల ఎత్తు పైకెక్కి కృష్ణమ్మ మన కుప్పంలోకి బిరబిరా వచ్చింది. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో బహిరంగ సభ సందర్భంగా నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తామని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.
మరో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం
కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ మరో రెండు ప్రాజెక్టుల పనులకు కూడా శ్రీకారం చుట్టేలా పరిపాలన అనుమతులిచ్చాం. కుప్పంలో రెండుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు గుర్తించాం. గుడుపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్‌ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్‌ను రూ.535 కోట్లతో నిర్మించడం ద్వారా అదనంగా మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేశాం. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్‌ను రూ.215 కోట్లతో నిర్మించేందుకు కూడా పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. వచ్చే టర్మ్‌లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీబిడ్డ మీకు అందిస్తాడు.
ముడుపులపై రీసెర్చ్
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే చంద్రబాబు అంచనాలను అమాంతం రూ.561 కోట్లకు పెంచేసి తన పార్టీ వారికి, బినామీలకు అప్పజెప్పాడు. నీళ్లు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారించే కాలువగా మార్చుకున్నారు. ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశారు. తన నియోజకవర్గ ప్రజలనే దోచుకుని కనీసం దాహార్తి తీర్చని నాయకుడిని ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి, మంచితనానికి జోహార్లు చెబుతున్నా.
మీకు మేలు చేసిందెవరు..?
35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? లేక మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 57 నెలల వ్యవధిలో కుప్పానికి మేలు జరిగిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు హెరిటేజ్ కోసం మూసివేసిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్‌ను తెచ్చి కుప్పం, పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించింది ఎవరంటే మీ జగన్.
ప్రతిష్టాత్మక వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం, పలమనేరు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. ఆ కాలేజీని చిత్తూరులో పునఃప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యుత్తు సబ్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చి పనులు చేయిస్తోంది ఎవరంటే మీ జగన్.
బాబుకు ఓటేసిన పేదలూ నావాళ్లే
కుప్పంలో చంద్రబాబుకు ఓటేసిన పేదలందరికీ ఓ మాట చెబుతున్నా. మీరందరూ నావాళ్లే అని భావిస్తూ మీకు మంచి చేశా. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే నవరత్నాల పథకాలను ఏకంగా 82,039 కుటుంబాలు (93.29 శాతం) అందుకున్నాయి. మనసున్న పాలన అంటే ఇది కాదా? 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేస్తే ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు అందచేశాం.
భరత్‌ను ఎన్నుకోండి.. గుండెల్లో పెట్టుకుంటా
బలహీన వర్గాలకు చెందిన భరత్‌ను ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఐదేళ్లలో మంచి చేశాం. భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్‌లో మంత్రిగా స్థానం ఇస్తా. గుండెల్లో పెట్టుకుంటా. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తామని మాట ఇస్తున్నా. మీలో ప్రతి ఒక్కరూ మీకు జరిగిన మంచిని వివరిస్తూ ఇంకో వంద మందితో మనకు ఓటు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని విన్నవిస్తున్నా.
‘కుప్పానికి మాటిచ్చా .. నిలబెట్టుకున్నా’
సీఎం వైఎస్ జగన్
‘కుప్పం నియోజకవర్గానికి నీరందించే గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకొచ్చాం. 2022 సెపె్టంబర్ 23న కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాట నిలబెట్టుకున్నాను’ అని సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సోమవారం ట్వీట్ చేశారు.
బ్యాంకు స్టేట్‌మెంట్లే సాక్ష్యం
కుప్పంలో ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు వెళ్లి గత పదేళ్ల అకౌంట్ స్టేట్‌మెంట్ తీసుకోండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ వచ్చాక ఐదేళ్లు కలిపి మొత్తం పదేళ్ల స్టేట్‌మెంట్‌ను పరిశీలించండి. చంద్రబాబు పాలనలో మీ బ్యాంకు ఖాతాల్లోకి కనీసం ఒక్క రూపాయైనా వచ్చిందేమో చూడాలని కోరుతున్నా. మీ బిడ్డ గత 57 నెలలుగా నవరత్నాలతో అందించిన సాయాన్ని చూడండి. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్మును కూడా తన నియోజకవర్గంలో తనవారు, కానివారు అని ఎలా విభజించారో ఇవాళ ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అర్థం అవుతుంది.
► చంద్రబాబు హయాంలో అరకొరగా రూ.1,000 ఫించన్ కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే ఇచ్చారు. ఇవాళ ఏకంగా 45,374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. నాడు రూ.200 కోట్లూ సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు రూ.507 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తోంది.
► ఒక్క కుప్పంలోనే 44,640 మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు పెట్టుబడి సాయంగా అందచేశాం. ఇవాళ కుప్పంలో 83 ఆర్బీకేలు, 93 గ్రామ, వార్డు సచివాలయాలు, 76 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయి.
► చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను దగా చేస్తే మనందరి ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా ద్వారా ఆదుకుంది. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.26 వేల కోట్లు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వగా ఒక్క కుప్పంలోనే 44,888 మంది అక్కచెల్లెమ్మలకు రూ.172 కోట్లు అందించాం. బాబు సున్నావడ్డీని ఎగ్గొడితే మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా కుప్పంలో 35,951 మంది తల్లులకు రూ.155 కోట్లు అందచేశాం.
► కుప్పంలో చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. మీ బిడ్డ ప్రభుత్వం కుప్పంలో ఇప్పటికే 15,721 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరో 15 వేలకుపైగా ఇళ్ల పట్టాలు కూడా నెల తిరగకుండానే ఇవ్వబోతున్నాం. మొత్తం 30 వేలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. చంద్రబాబు హయాంలో కుప్పంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లు 3,547 కాగా కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వం 7,898 ఇళ్లు మంజూరు చేసి ఇప్పటికే 4,871 ఇళ్లను పూర్తి చేసింది.
► వైఎస్సార్ చేయూత ద్వారా కుప్పంలో 19,921 మంది కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే రూ.85 కోట్లు జమ చేశాం.
► నాడు కుప్పంలో 7,002 మందికి ఆరోగ్యశ్రీతో రూ.28 కోట్లు విదిలిస్తే మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు విస్తరించి ఆరోగ్య ఆసరా కూడా అందిస్తూ 17,552 మందికి రూ.64 కోట్ల మేర మేలు చేసింది.
► బాబు హయాంలో అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 8,459 మందికి రూ.27 కోట్లు ఇస్తే.. మనందరి ప్రభుత్వం వంద శాతం రీయింబర్స్‌మెంట్‌తో 12,093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము రూ.61 కోట్లు.
బీసీల సీటు బాబు కబ్జా
చంద్రగిరిలో చంద్రబాబును 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. తర్వాత ఇక్కడ (కుప్పం) ధనబలం చూపిస్తూ వలస వచ్చారు. బీసీల సీటును కబ్జా చేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 ఏళ్లుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి ఆయన ఏమిచ్చారో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఆ మనిషి 75 ఏళ్ల వయసు వచ్చాక మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్లి ఫలానా మంచి చేశానని చెప్పలేడు. పొత్తులు, దత్తపుత్రుడితో ప్యాకేజీ గురించి తలుపులు బిగించుకొని మాట్లాడతారు. కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి బాబూ? వంగవీటి రంగా హత్యకు పురిగొల్పింది మీరే కదా?
కుప్పంలో జన జాతర
సాక్షి, తిరుపతి: కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది. దశాబ్దాల కల నెరవేర్చడం పట్ల జనం నీరాజనం పలికారు. కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసేందుకు సీఎం వైఎస్ జగన్ సోమవారం రామకుప్పం మండలం రాజుపేట సమీపంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు వస్తున్నారని తెలుసుకుని పరిసర ప్రాంతాల రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలువ పొడవునా జగన్‌కు జేజేలు పలికారు. పలమనేరు, కుప్పం నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనంతో శాంతిపురం మండలం గుండశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రాంతం నిండిపోయింది.
సీఎం వైఎస్ జగన్ హెలిపాడ్ నుంచి బస్సులో కూర్చొని దారిపొడవునా జనానాకి అభివాదం చేస్తూ బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చారు. జగన్‌కు దారిపొడవునా పూలు చల్లుతూ జనం ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ.. ఈలలేస్తూ, చప్పట్లు కొడుతూ.. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చేత పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ప్రజల ఓట్లతో గెలుస్తూ.. కుప్పం ప్రజలకు చేస్తున్న అన్యాయం, మోసం గురించి సీఎం జగన్ వివరిస్తున్న సమయంలో జనం పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ.. నిజమే.. నిజమే.. అని అరస్తూ కనిపించారు.
2022 సెప్టెంబర్ 23న కుప్పంకు వచ్చిన సమయంలో తాను ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను తీసుకొచ్చానని చెప్పటంతో ‘మళ్లీ సీఎం మీరే’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. మరో మూడు రిజర్వాయర్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించటం పట్ల, చంద్రబాబు 35 ఏళ్లుగా చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ, డీఎస్పీ డివిజన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన సమయంలో జనం మరింత బిగ్గరగా కృతజ్ఞతలు తెలిపారు.
నమ్మలేక పోతున్నాం
మా గ్రామాల మీదుగా కృష్ణా జలాలు ప్రవహిస్తాయని ఇప్పటి వరకు ఊహించలేదు. నీటి ప్రవాహన్ని చూస్తుంటే నమ్మలేక పోతున్నాం. హంద్రీ–నీవా కాలువలో నీళ్లు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోంది. కరువు కాటకాలతో ‡బతుకుతున్న మా జీవితాల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారు. జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తిన్నా తీర్చుకోలేనిది. తాగడానికి నీళ్లతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బతుకు కల్పించారు.
– చంద్రశేఖర్, పెద్దబళ్దార్, రామకుప్పం మండలం
వైఎస్సార్‌సీపీని గెలిపిస్తాం
రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్న జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం. ప్రతిపక్ష నేత నియోజకవర్గమైనా రూ.250 కోట్లతో కాలువ పనులు పూర్తిచేసి కుప్పం ప్రజలకు నీళ్లు ఇచ్చిన దేవుడు జగన్. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుదలకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి మంచి నాయకుడిని మళ్లీ సీఎం చేసుకోవడం అందరి బాధ్యత. భరత్‌ను గెలిపించుకుంటాం.
– సుబ్రమణ్యం, రామకుప్పం మండలం
రుణం తీర్చుకుంటాం
40 ఏళ్ల మా కలను నెరవేర్చిన మ్యుమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకునేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఈ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. మంచి చేసిన వారిని ఆదరించడమే కుప్పం ప్రజలకు తెలుసు. తాగు, సాగునీటి సమస్య తీర్చిన సీఎం జగన్‌ను మరవలేం.
– గురుస్వామి, వెదురుగుట్టపల్లి, శాంతిపురం మండలం
Comments
Please login to add a commentAdd a comment