
సాక్షి, అమరావతి: ప్రపంచం యావత్తు కోవిడ్‌తో తల్లడిల్లిపోతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ, ముందుగా ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నవరత్నాల క్యాలెండర్ ప్రకారం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి వారి ఖతాలకు డబ్బు జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు.
ఐదేళ్లలో రూ.75,000
► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.
► ఈ పథకం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, నేడు 3,27,244 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న రూ.490.86 కోట్లతో కలిపి మొత్తం రూ.981.88 కోట్ల లబ్ధి కలుగుతుంది. ఈ కులాల్లోని పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది.
► గత ప్రభుత్వం ఈ కులాలకు వివిధ రూపాల్లో ఏటా సగటున ఇచ్చింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. కానీ జగన్ ప్రభుత్వం రెండేళ్లలోనే 59,63,308 మందికి 15 రెట్లు ఎక్కువగా రూ.12,126.78 కోట్ల లబ్ధి చేకూర్చింది.
► గత ప్రభుత్వం కాపు కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుండా చేసిన పరిస్థితిని వైఎస్ జగన్ ప్రభుత్వం సరిదిద్దింది. తద్వారా వీరికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment