అందరికంటే మిన్నగా ‘కాపు’కాశాం | CM YS Jagan Comments At YSR Kapu Nestham Funds Release | Sakshi
Sakshi News home page

అందరికంటే మిన్నగా ‘కాపు’కాశాం

Published Sun, Sep 17 2023 2:58 AM | Last Updated on Sun, Sep 17 2023 7:12 AM

CM YS Jagan Comments At YSR Kapu Nestham Funds Release - Sakshi

నిడదవోలులో జరిగిన బహిరంగసభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం

నిడదవోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే మిన్నగా మన ప్రభుత్వంలో కా­పుల సంక్షేమానికి అన్ని విధాలా కాపు కాశాం. కాపు నేస్తంతో పేదలైన కాపు అక్కచెల్లెమ్మలను ఆర్ధికంగా ఆదుకున్నాం. నాతో పాటు కేబినెట్‌లో కాపులను పక్కన కూర్చోబెట్టుకున్నా. నామినేటెడ్‌ పదవుల్లోనూ మిగిలిన వర్గాల పక్కనే కూర్చోబెట్టాం. కాపు కుటుంబాల్లోని అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం మన ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పరితపిస్తోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన కాపు నేస్తం నాలుగో విడత సొమ్ము విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్ధేశించి మాట్లాడారు. ‘కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేదలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం.

వరుసగా ఐదేళ్ల పాటు, మొత్తంగా రూ.75 వేల ఆర్ధిక సాయం అందించే పథకాన్ని అమలు చేస్తున్నాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు రూ.2029 కోట్ల ఆర్ధిక సాయం చేసినట్టయింది. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపు 4 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున అందజేశాం. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని, ఆర్ధిక స్వావలంబన సాధించాలని అడుగులు ముందుకు వేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగం 
► నా అక్కచెల్లెమ్మల్లో పేదవాళ్లు ఎక్కడున్నా, వారికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అక్కచెల్లెమ్మల చేతిలో ఈ డబ్బు పెడితే అది వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న నమ్మకంతో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టాం. 

► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున  నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటిదాకా 26,39,703 మందికి రూ.14,129 కోట్లు అందజేశాం.  

► ఓసీల్లో పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా అండగా నిలబడాలని 45–60 ఏళ్ల మధ్య ఉన్న వారి కోసం వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున వరసగా మూడేళ్లలో మొత్తం రూ.45 వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు 4,39,068 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 1,257 కోట్లు ఇచ్చాం. నా కాపు అక్కచెల్లెమ్మలకు కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్‌ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించాం. ఇది రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమం. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ కాపునేస్తం.. ఈ మూడు పథకాల ద్వారానే 34.37 లక్షల మందికి తోడుగా ఉన్నాం. 

► రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక, వివిధ పథకాల ద్వారా 2.06 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయాల్లో మన కళ్లెదుటే దాదాపు 1.30 లక్షల మంది పిల్లలు వైద్య, ఆరోగ్య, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో మరో 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 2.06 లక్షల ఉద్యోగాలలో కాపు చెల్లెమ్మలు, తమ్ముళ్లకు లభించిన ఉద్యోగాలు దాదాపు 9.5 శాతం.  

సామాజిక న్యాయం మన విధానం  
► సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వం ఇది. కాపు సోదరులకు రెండు కేబినెట్లలో సముచిత స్థానం కల్పించాం. ఒక్కో కేబినెట్‌లో నలుగురు మంత్రులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి నా పక్కనే కూర్చొబెట్టుకున్నాను. మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఐదుగురు మంత్రులు కనిపిస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీతో పాటు నా కాపుసోదరుడు కనిపిస్తాడు. కారణం ఇది మీ అందరి ప్రభుత్వం కాబట్టి. 

► మొత్తంగా నామినేటెడ్‌ పోస్టుల్లో ఏకంగా 12 శాతం కాపు సోదరులకు, అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. ఇప్పటి వరకు నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన రూ.2.31 లక్షల కోట్లలో కాపులకు అందిన మొత్తం రూ.22,333 కోట్లు.  

► నాన్‌ డీబీటీ పథకాలలో జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇలా ఎన్నో చేశాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కో ఇంటి స్థలం విలువ కనీసం రూ.5 లక్షలు ఉంటుంది. ఇలా నాన్‌ డీబీటీ పథకాల ద్వారా నా కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో రూ.16,914 కోట్లు. 2.46 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇలా డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాలను కలిపి చూస్తే కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు ఈ నాలుగేళ్లలో రూ.39,247 కోట్లు లబ్ధి కల్పించాం. 

10 శాతం కూడా మేలు చేయని చంద్రబాబు  
► మనం ఖర్చు చేసిన రూ.39,247 కోట్లలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం 10 శాతం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథ కమిషన్‌ పేరిట చేసింది ఒక మోసమైతే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాన్ని పంచడం సాధ్యం కాదని తెలిసి కూడా మరో మోసం చేసింది. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు. 

► మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు ఏటా రూ.2 వేల కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. ఇలా ఐదేళ్లలో కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. కానీ, నాలుగేళ్లలోనే డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.39,247 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు తన జీవితమంతా సామాజిక వర్గాలన్నింటినీ వంచించారు. 

► మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్‌ ఉందో మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా దాదాపు అదే బడ్జెట్‌. అప్పుడు ఎంత ఆదాయం ఉందో ఇప్పుడూ కూడా అంతే. పైగా మీ బిడ్డ ప్రభుత్వంలో అనుకోకుండా కోవిడ్‌ వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ మీ బిడ్డ రూ.2.35 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఎలా జమ చేశాడు. ఇలా చంద్రబాబు ఎందుకు చేయలేదు? మీరే గమనించాలి.   

మా కుటుంబానికి రూ.4,45,000 లబ్ధి 
అన్నా.. మీలాగ ఏ రాజకీయ నాయకుడు కూడా మా కాపులను గుర్తించలేదు. మీరు వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. నేను గత ఏడాది, ఈ ఏడాది సాయం పొందాను. నేను చదువుకోకపోయినా, మీ పథకాల ద్వారా నా పిల్లలు ముగ్గురినీ చదివిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది.  మా డ్వాక్రా గ్రూప్‌కు రుణమాఫీ జరిగింది. సొంతింటి కల నెరవేరుతోంది. మొత్తంగా మా కుటుంబానికి ఈ ప్రభుత్వంలో రూ.4,45,000 లబ్ధి కలిగింది. నాలాగ లబ్ధి పొందిన వారంతా మీకు రుణపడి ఉంటాం. 
– సుబ్రమణ్యేశ్వరి, లబ్ధిదారు, వేమగిరి, కడియం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement