ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ చెల్లించాల్సిన 1702 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. 2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ 1702.90 కోట్లు రూపాయలు బకాయి ఉందని మంత్రి వివరించారు.
ఢిల్లీలో గురువారం నాడు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఏ కరువు పెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
అలాగే 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బకాయి పడిన 963.07 కోట్లను కూడా ఇప్పించాలని మంత్రి కారు మూరి కోరారు. వీటికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను పలుమార్లు కేంద్రానికి సమర్పించామన్నారు. గోనె సంచుల విషయంలో కూడా వరి ధాన్యానికి వినియోగించే గన్నీ బ్యాగులకు నగదును కేంద్రం చెల్లించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ డిప్యూటీ సెక్రటరీని అయన కోరారు. హమాలీలకు చెల్లించాల్సిన మండి లేబర్ ఛార్జీలు కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉందన్నారు.
క్వింటాలుకు 22 రూపాయల వంతున కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 2024-25 ఆర్ధిక సంవత్సరం వరకూ మండి లేబర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని మంత్రి కారుమూరి వివరించారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరితో పాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సంస్థ ఎండీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment