సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏబీఎన్ రాధాకృష్ణ విషం కక్కుతున్నాడని, ఇది మరీ పరాకాష్టకు చేరిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ధ్వజమెత్తారు. మీడియా అంటే విశ్వసనీయత ఉండాలని, అది కోల్పోయిన పత్రిక ఆంధ్రజ్యోతి అని మండిపడ్డారు. ఇలాంటి వెకిలి రాతలతో వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ‘‘పనిగట్టుకుని ఇన్ని అబద్ధాలా? అసలు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా ఇలాంటి రాతలు రాస్తారా? మీలో మానవత్వం ఉందా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనని మాటల్ని పనిగట్టుకుని రాయటం, ఇలా విష ప్రచారానికి దిగటం సిగ్గుచేటు’’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు విదిల్చే బిచ్చం కోసం రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నాడన్నారు. ఇలాంటి రాతలపై పరువునష్టం దావా వేస్తామని, ప్రజలంతా రాష్ట్రవ్యాప్తంగా కేసులు వేసి బోనులో నిలబెడతారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు మీదా వెకిలి వ్యాఖ్యలు చేసిన వెకిలిగాళ్లు చంద్రబాబు, రాధాకృష్ణ అని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీలో షరతులతో ఓ మాజీ అధికారి చేరాడంటూ ఆంధ్రజ్యోతి రాసిన రాతలను ఖండించారు. ‘‘ఇలా షరతులతో పార్టీలో చేరిన ఒక్కరిని చూపించండి చాలు?’’ అంటూ సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
జగన్ అందరిలోనూ దేవుణ్ణి చూస్తారు
‘వైఎస్ జగన్ ప్రతి వ్యక్తిలోను దేవుణ్ణి చూస్తారు. దేవుడి మీద భయం, భక్తి లేని నాస్తికులు చంద్రబాబు, రాధాకృష్ణ. దేవాలయాల్లో క్షుద్రపూజలు చేసిన చరిత్ర వాళ్లది. తాను అర్ధరాత్రి దేవుడితోను, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోను మాట్లాడతానని.. పార్టీలో చేరేందుకు వచ్చిన విశ్రాంత అధికారికి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టు ఆంధ్రజ్యోతి దిగజారుడు రాతలు రాయడం సిగ్గుచేటు. వైఎస్ జగన్‌తో మాట్లాడిన ఆ అధికారి ఎవరో బయటకు తీసుకురావాల్సిన బాధ్యత రాధాకృష్ణదే. దీనిపై ఎక్కడైనా... మేం చర్చకు సిద్ధం. ఎల్లో మూక పిచ్చిరాతలతో జగన్ మనో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని గుర్తుంచుకుంటే మంచిది. అయినా ఆ అధికారితో చర్చలు జరపాల్సిన పని ఏముంది? 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ తాను దేవుడితో మాట్లాడతానని జగన్ చెప్పలేదే. ఈయనకే చెప్పాడా? ఆంధ్రజ్యోతికి ఏమాత్రం విశ్వసనీయత లేదు. ఏబీఎన్ అంటే ఆల్ బోగస్ న్యూస్ చానెల్. చంద్రబాబు వేసే బిచ్చం కోసం ఈ స్థాయికి దిగజారటం సిగ్గుచేటు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు దుర్మార్గం. ఆయన రాక్షసుడు కాదు.. రక్షకుడు.
పిచ్చిరాతలు రాస్తే సహించం
వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ పదేళ్లుగా విషపు వార్తలు రాస్తూనే ఉన్నాడు. సీఎం దగ్గరకు సభ్యతగా వెళ్తే దాన్నీ తప్పుగా చిత్రీకరించడం మర్యాదేనా? చంద్రబాబుకు ముఖ్య భద్రతాధికారిగా పనిచేసిన ఇక్బాల్ ఆయన పద్ధతి నచ్చకపోవడం వల్లే.. పదవీ విరమణ పొందాక షరతులు లేకుండా వైఎస్ జగన్ పార్టీలో చేరారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ప్రజలు గమనించాలి. మహా నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, రామోజీరావు.. ఆయన చనిపోతే ఇక తిరుగుండదని పండుగ చేసుకున్నారు. వైఎస్సార్‌ను మించిన మహావృక్షంలా జగన్ ఎదిగితే విషం కక్కుతున్నారు. కులం, వర్గం అంటూ రెచ్చగొడుతున్నారు. ఇలాంటి పిచ్చిరాతలు రాస్తే పరువు నష్టం దావా వేసి బోనులో నిలబెడతాం. ప్రజలు జగన్‌ను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇన్నేళ్లుగా విషం కక్కి రాధాకృష్ణ సాధించిందేమిటి? విశ్వసనీయత పోగొట్టుకున్నాడే తప్ప జగన్‌ను ఏమీ చేయలేకపోయాడని గుర్తించాలి..’ అని మంత్రి నాని పేర్కొన్నారు.
పని కట్టుకుని ఇన్ని అబద్ధాలా?
Published Mon, Jun 28 2021 3:50 AM | Last Updated on Mon, Jun 28 2021 7:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment