
( ఫైల్ ఫోటో )
ఓం శ్రీ గురుభ్యో నమః! తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం... ఇవి మనకు చిన్నప్పుడు నేర్పే విషయాలు . గురువులు కూడా అలాగే విద్యార్దులను తమ సొంత బడ్డల మాదిరి చూసుకుంటారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలవల్ల విద్యా వ్యవస్థ దారి తప్పింది. ప్రత్యేకించి ప్రభుత్వరంగంలో ఉన్న స్కూళ్లు, కాలేజీలు ఆశించిన రీతిలో పనిచేయకపోవడం అందరికి బాధ కలిగించే విషయమే. ఏదైనా ప్రభుత్వం స్కూళ్లను ,విద్యను సంస్కరించాలని ప్రయత్నిస్తే వాటిని స్వాగతించవలసిన టీచర్లు ఏదో రకంగా చెడగొట్టేపనిలో ఉంటున్నారు.
అందరు అలా ఉన్నారని చెప్పడం లేదు. కానీ ఉపాధ్యాయసంఘాల రాజకీయాల కారణంగా టీచర్లు బాధత లేకుండా వ్యవహరించడం సర్వసాధారణం అయిపోయింది. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపడానికి అలవాటు పడుతున్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వ స్కూళ్లవారు అవమానంగా ఫీల్ కావడం లేదు. ప్రభుత్వ స్కూళ్లు పదో తరగతి పరీక్ష పలితాల సాధనలో బాగా వెనుకబడి ఉంటున్నాయి. ప్రభుత్వం వైపు సరైన పర్యవేక్షణ లేకపోవడం, స్కూళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడంవంటి పలు కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ప్రభుత్వం అడగడుగునా ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.
రాజకీయ పార్టీల నుంచి ఏదో విమర్శ వస్తే పర్వాలేదు. కానీ టీచర్ల సంఘాలు కూడా రాజకీయం చేస్తున్నాయి. ఏపీలో స్కూళ్లకు టీచర్లు సకాలంలో రావాలని, వచ్చినవారు కచ్చితంగా యాప్ ద్వారా తమ అటెండెన్స్ వేయించుకోవాలని విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఒప్పుకోవడం లేదు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సంఘాల నేతలు టీచర్లకు చెప్పడం దారుణం. కొందరు టీచర్లు తమకు ప్రభుత్వం సెల్ పోన్లు ఇస్తే యాప్ డౌన్ లోడ్ చేస్తామని అన్నారట. తమ ఇంటర్ నెట్ డేటా ను ఇందుకు వాడబోమని, ఏవేవో చెబుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించకుండా వ్యవహరించారు.మొదట కొందరు ఇలా అడమెంట్ గా ఉన్నా, ప్రస్తుతం మెజార్టీ టీచర్లు యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని సమాచారం వచ్చింది.
అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది?టీచర్లు సకాలంలో స్కూళ్లకు రాకపోవడం వల్లే కదా? వచ్చినా సరిగా పాఠాలు చెప్పకపోవడం వల్లే కదా? ఫలితాలు సరిగా లేకపోవడం వల్లే కదా? తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ, ప్రభుత్వ స్కూళ్లలో వీరు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే కదా? ఒకప్పుడు స్కూళ్లు అద్వాన్నంగా ఉన్న మాట నిజమే. కాని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక మార్పులు తీసుకు వచ్చారు. అమ్మ ఒడి స్కీమ్ ద్వారా పిల్లలు బడులకు వచ్చేలా కృషి చేస్తున్నారు. ,స్కూళ్లను నాడు నేడు కింద బాగు చేయడం ద్వారా, ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టడం వంటి వాటి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్ధులను బాగా ఆకర్షించగలుగుతున్నారు. ఏడు లక్షల మంది పిల్లలు అదనంగా ఈ స్కూళ్లకు రావడమే నిదర్శనం. ఇలాంటప్పుడు టీచర్లు ఎంత సంతోషంగా పనిచేయాలి? అలా చేయకుండా కొంతమంది తమ సొంత వ్యాపారాలకు ప్రాదాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్, ఎల్ ఐ సి వంటి వాటికి కమిషన్ ఏజెంట్లుగా ఉంటున్నారట.పిఆర్సిలో ఏదైనా కొద్దిగా తేడా వస్తే వేల రూపాయలు ఖర్చు చేసుకుని మరీ వచ్చి విజయవాడలో ఆందోళనకు దిగిన టీచర్లు , తమ సొంత పోన్ లో యాప్ పెట్టుకుని అటెండెన్స్ ఇవ్వరట. ఆ కొద్దిపాటి ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలట. స్కూళ్లలో ఆయా సదుపాయాల తీరుతెన్నుల బాద్యత కూడా వీరికే పెట్టడం నచ్చడం లేదట.ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. ప్రైవేటు స్కూళ్లలో,కార్పొరేట్ విద్యా సంస్తలలో పనిచేసే టీచర్లు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. ఏ టైమ్ కు వస్తున్నారు? ఏ టైమ్ కు వెళుతున్నారు?వారు ఎలాంటి బాద్యతలు నిర్వహిస్తున్నారు? ఉదయం ఎనిమిది గంటలకు వస్తే,సాయంత్రం ఆరున్నర,ఏడు గంటలకు కాని ఇంటికి చేరుకోరు. కొందరైతే ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా పిల్లల డౌట్లు తీర్చాల్సి ఉందట. టెన్త్ అయినా, ఇంటర్ అయినా సరైన ఫలితాలు సాధించకపోతే ఉద్వాసనకు గురికావల్సి ఉంటుంది. ప్రభుత్వ టీచర్లతో పోల్చితే వారి జీతాలు కూడా తక్కువే. వీటిపై టీచర్ల సంఘాలు ఆలోచించవు.
వారి ఎన్నికల రాజకీయాలు వారివి. ఓట్ల రాజకీయాలతో ప్రభుత్వంలో ఉన్నవారిని బెదిరించడానికి యత్నిస్తుంటారు. ఇవన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది. ఒకరకంగా ప్రతిపక్షనేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన విషయాలే కరెక్టేమో అన్న భావన ఏర్పడేలా వీరు వ్యవహరిస్తున్నారు. విద్య అన్నది ప్రభుత్వ బాద్యత కాదని, అది కార్పొరేట్ సంస్తల బాద్యత అని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట మార్చుతారేమో తెలియదు. మరో వైపు ముఖ్యమంత్రి జగనేమో పిల్లలకు విద్యే సంపద అని, దానిని సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక సందర్శనలు అంటూ హడావుడి చేసేవారు. ఆయా శాఖల ఉద్యోగులను ప్రజల సమక్షంలోనే మందలించేవారు. కొన్నిసార్లు ఉద్యోగులు అవమానానికి గురి అయ్యేవారు.
టీచర్లే కాకుండా, మున్సిపల్ కమిషనర్లు, వీఆర్‌ఓ వంటివారు ఈ బాదితులలో ఉండేవారు. అప్పట్లో ఈనాడు వంటి టిడిపి మీడియా సంస్తలు చంద్రబాబును తెగపొగిడేవి. ఉద్యోగులు ,ఉపాధ్యాయులు బాద్యతగా ఉండాలని ఉద్భోధించేవి. కాని ఇప్పుడు అదే మీడియా టీచర్లను రెచ్చగొట్టేలా వార్తలు ఇస్తున్నాయి. ఈ మీడియాను కొన్ని ప్రశ్నలు అడగండి. మీ ప్రైవేటు సంస్థలలో హాజరు ఎలా తీసుకుంటున్నారు.కొద్ది నిమిషాల లేటును అనుమతిస్తున్నారా? కరోనా టైమ్ లో వీరు జీతాలు ఇచ్చారా? అసలు ప్రైవేటు మీడియా సంస్థలలో యూనియన్లను అనుమతిస్తున్నారా?అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి.
చంద్రబాబు టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి సదుపాయాలు ప్రత్యేకంగా కల్పించలేదు. అందుకు బిన్నంగా జగన్ పనిచేస్తుంటే ఏదో రకంగా చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మరో విషయం చెప్పాలి. నిజంగానే ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఏవైనా ఇబ్బందికరమైన టెక్నికల్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా కృషి చేయవలసి ఉంటుంది. దానిని ప్రభుత్వానికి తెలపడం వరకు తప్పులేదు. ఇప్పటికే ఆ దిశగా అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు. కాని ఆ వంకతో టీచర్లు తమ ఇష్టం వచ్చినట్లు చేస్తామన్నట్లుగా ప్రవర్తించడం వారి వృత్తికే ధర్మం కాదు.వారు ఇదే పద్దతి కొనసాగిస్తే ప్రజలలో పలచన అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ టీచర్ల తీరుపై సోషల్ మీడియాలో పలు వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆ విషయాలను కూడా గమనించి వారు బాద్యతగా వ్యవహరించి పిల్లలను తమ సొంత కుటుంబంగా భావించి విద్యారంగ అబివృద్దికి కృషి చేస్తారని ఆశిద్దాం. తల్లిదండ్రుల తర్వాత భావి పౌరులను తయారుచేసే గురువులే దైవంతో సమానమన్న నానుడిని నిజం చేయాలని కోరుకుందాం.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment