Konaseema Issue: Reason behind Amalapuram Attacks in Telugu - Sakshi
Sakshi News home page

Konaseema Issue: ‘కోన’లో కుట్ర కోణం!

Published Thu, May 26 2022 4:22 AM | Last Updated on Thu, May 26 2022 12:52 PM

Konaseema District Amalapuram Attacks by TDP Janasena - Sakshi

అసాంఘిక శక్తుల దాడిలో పూర్తిగా కాలిపోయిన మంత్రి విశ్వరూప్‌ నివాసం

సాక్షి, అమరావతి: కోనసీమలో విధ్వంసం వెనుక కుట్ర కోణం బట్టబయలవుతోంది. అమలాపురంలో ర్యాలీని అసాంఘిక శక్తులు హైజాక్‌ చేసి అల్లర్లకు పాల్పడటం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ముందస్తు కుట్ర దాగి ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. కోనసీమ పరిరక్షణ సమితి ముసుగులో టీడీపీ, జనసేన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలే ఈ కుట్రలో పాలు పంచుకున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవలే డిమాండ్‌ చేయగా.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆయన పార్టీ నేతలతో ఈమేరకు ఏకంగా దీక్షలు కూడా చేయించారు.మరోవైపు ఇందుకు విరుద్ధంగా అమలాపురంలో అల్లర్లకు పాల్పడేలా టీడీపీ, జనసేన శ్రేణులను ఆ పార్టీల అధినేతలు ఉసిగొల్పడంపై సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఫుటేజీలు, క్లిప్పింగుల పరిశీలన 
అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసు శాఖ ఈ విధ్వంసం వెనుక కుట్ర కోణంపై దర్యాప్తును ముమ్మరం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం 46మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగుల ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొని విధ్వంసం సృష్టించిన 72 మందిని ఇప్పటివరకు గుర్తించారు. వారిలో 12 మందిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కోనసీమతోపాటు పొరుగు జిల్లాల్లో రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. అసాంఘిక శక్తులు పక్కా పన్నాగంతోనే కుట్రను అమలు చేశాయి. 

ఎర్రవంతెన వద్ద బస్సులు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ డీజీపీ శంకర్‌ భక్షీ, ఇతర పోలీసు అధికారులు  

టీడీపీ, జనసేన నేతల పనే! 
► అమలాపురంలో విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన నేతల ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తుల్లో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. హింసకు పాల్పడి తిరిగి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేలా రెండు పార్టీలకు చెందిన నేతలు పథకం రచించారు.
► విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన 72 మందిలో ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది జనసేన, ఇద్దరు టీడీపీకి చెందిన వారున్నారు. ఒకరు మాత్రం ఏ పార్టీతోనూ సంబంధంలేని యువకుడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 
► హింసకు పాల్పడినట్లు గుర్తించిన వారిలో 60 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జనసేన, టీడీపీతో అనుబంధం ఉన్నవారే వీరిలో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

► ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఆందోళనలకు నేతృత్వం వహించిన ఓ నేత అమలాపురం అల్లర్ల వెనుక కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తనను తాను తటస్థుడినని చెప్పుకునే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నది బహిరంగ రహస్యమే. ర్యాలీకి జనసమీకరణ, అవసరమైన సామగ్రి సమకూర్చడం, ర్యాలీలో ఎవరు ముందుండాలి? ఎప్పుడు, ఏ దిశగా తీసుకువెళ్లాలి? అనే అంశాలను మరికొందరితో కలసి నిర్దేశించినట్లు తెలుస్తోంది. దాడుల్లో పాల్గొన్న కొందరిని పోలీసులు విచారించగా ఆ నేత పేరు వెల్లడించినట్లు  సమాచారం. 
► అక్కడకు అత్యంత సమీపంలో ఉన్న ఉన్న మాజీ హోంమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నివాసాల వైపు రౌడీమూకలు కన్నెత్తి కూడా చూడలేదు. 

► అల్లర్ల వెనుక ప్రతిపక్ష పార్టీలు పక్కా ప్రణాళికతో వ్యవహరించాయన్నది స్పష్టమవుతోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్త అన్యం సాయి తీరే దీనికి నిదర్శనం. కోనసీమ జిల్లాకు బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా మూడు రోజుల క్రితం జరిగిన కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా అతడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ నేతలతో కలసి ఫొటోలు దిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. వైఎస్సార్‌సీపీతో అతడికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు స్పష్టమైంది. వాస్తవానికి అన్యం సాయి జనసేనలో క్రియాశీల కార్యకర్త. పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో సైతం పాల్గొన్నాడు. పవన్‌ కల్యాణ్‌తోపాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 
► కుట్రలో పాత్రధారులే కాకుండా తెరవెనుక సూత్రధారులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వీరిలో కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. మొబైల్‌ టెక్నాలజీ సహకారంతో వాటిని వెలికి తీయనున్నారు. కీలక అనుమానితుల కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నారు.  

కనుసైగతో విధ్వంసం 
అసాంఘిక శక్తులు కొద్ది రోజులుగా కుట్రకు పదును పెట్టాయి. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన కోనసీమ పరిరక్షణ సమితి భారీగా యువతను తరలించింది. ర్యాలీలో చొరబడ్డ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుట్రను అమలు చేశాయి. పెద్ద సంఖ్యలో రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు పెట్రోల్‌ బాటిళ్లు, డబ్బాలు, రాళ్లు, సోడాబుడ్లతో అమలాపురం వీధుల్లో, సందుల్లో మాటేశాయి. ర్యాలీలో ముందు భాగంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు సైగ చేయగానే ఒక్కసారిగా చొరబడి బీభత్సం సృష్టించాయి. నినాదాలు చేస్తూ ప్రణాళిక ప్రకారం యువకులను దారి మళ్లించాయి. 

ఏమాత్రం జాప్యం జరిగినా.. 
బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఈ ర్యాలీని వేదికగా మార్చుకున్నాయి. దళిత, బీసీ వర్గాలకు చెందిన మంత్రి పినిపె విశ్వరూప్, వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను అసాంఘిక శక్తులు లక్ష్యంగా చేసుకుని ర్యాలీని వారి నివాసాల వైపు మళ్లించాయి. అందుకు రెండు రోజులుగా పక్కా పన్నాగం పన్నినట్టు పోలీసులు గుర్తించారు. ర్యాలీలో చొరబడ్డ రౌడీషీటర్లు అమలాపురంలోని ఎర్రవంతెన వైపు యువకులను పరుగులు తీయించారు. మార్గమధ్యంలో మూడు బస్సులను దగ్ధం చేసి రౌడీమూకలు అటు చేరుకున్నాయి.

పెట్రోల్‌ బాటిళ్లు ఇంట్లోకి విసిరి నిప్పు పెట్టాయి. అనంతరం మంత్రి విశ్వరూప్‌ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని అటువైపు కదిలాయి. ఆ ఇంటికి కూడా నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డాయి. కుట్రలో తరువాత ఘట్టంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైకి దండెత్తాయి. ఎమ్మెల్యే సతీష్‌ కుటుంబ సభ్యులతో సహా మొదటి అంతస్తులోగా ఉండగా గ్రౌండ్‌ ఫ్లో్లర్‌లోని ఆయన కార్యాలయాన్ని తగలబెట్టారు.

రెండో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించేసరికి పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యే సతీష్, ఆయన కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు. కుటుంబ సభ్యులతో  ఎమ్మెల్యే సతీష్‌ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకునే దాడికి దిగారు. పోలీసులు తక్షణం అప్రమత్తం కాకుంటే ఘోరం జరిగిపోయేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడం గమనార్హం. ఎమ్మెల్యేను అంతమొందించే లక్ష్యంతోనే పెట్రోల్‌ బాటిళ్లు విసిరేశారని దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. 

దేశవ్యాప్తంగా మహనీయుడి పేరు 
► రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును దేశవ్యాప్తంగా> ఎన్నో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలు, జిల్లాలకు పెట్టారని సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలో ఓ డివిజన్‌ను విభజించి 1995 సెప్టెంబరు 29న అంబేడ్కర్‌నగర్‌ జిల్లాగా పేరు పెడితే ఆ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకున్నారు.  
► జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ సమయంలో స్థానికులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన మేరకు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడుతూ ఈనెల 18న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంటే అన్ని వర్గాల ఏకాభిప్రాయంతోనే కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టినట్లు స్పష్టమవుతోంది.

దిగజారుడుకు పరాకాష్ట..
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆపార్టీ శ్రేణులతో దీక్షలు చేయించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఇటీవల కాకినాడ జిల్లా తాళ్లరేవు పర్యటన సందర్భంగా కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు వారిద్దరూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దిగజారుడుకు పరాకాష్టగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అన్ని వర్గాలు అభిమానించే అంబేడ్కర్‌ను ఓ కులానికి పరిమితం చేసే కుట్రకు టీడీపీ, జనసేనలు పాల్పడ్డాయని మండిపడుతున్నారు. 

మంగళవారం మంటల్లో కాలిపోతున్న బస్సు 

ప్రజాస్వామ్యం అపహాస్యం..
ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు అంతే బాధ్యత ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల డిమాండ్ల మేరకే కోనసీమకు అంబేడ్కర్‌ పేరును ప్రభుత్వం పెట్టింది. దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయా వర్గాలకు చెందిన నేతలు అంబేడ్కర్‌ గొప్పతనాన్ని వివరించి చైతన్యం చేయాలన్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన మాత్రం తమ శ్రేణులను పురిగొల్పి విధ్వంసం సృష్టించి హింసకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement