కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి | Kotappakonda farmers threatened by TDP MLA Chadalawada followers | Sakshi
Sakshi News home page

కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి

Feb 13 2026 5:26 AM | Updated on Feb 13 2026 5:26 AM

Kotappakonda farmers threatened by TDP MLA Chadalawada followers

కోటప్పకొండ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అనుచరుల బెదిరింపులు

రూ.5 లక్షలు ఇస్తేనే శివరాత్రి ఉత్సవాల్లో దుకాణాలు పెట్టుకోండంటూ హుకుం 

లేదంటే ధ్వంసం చేస్తామని బెదిరింపులు 

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం 

చేసేది లేక కోటప్పకొండ తిరునాళ్ల  ప్రదేశంలో ధర్నాకు దిగిన రైతులు

నరసరావుపేట రూరల్‌: ‘మేం అడిగినంత ఇస్తేనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. మాకు తెలియకుండా ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తాం’ అంటూ పల్నాడు జిల్లా కోటప్పకొండలోని రైతులను, దుకాణాదారులను నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చదలవాడను బాధిత రైతులు కలిసి గోడును వెళ్లబోసుకోగా.. తన అనుచరులు చెప్పినట్టు చేయాలని ఆయన చెప్పడంతో రైతులు కోటప్పకొండలో ఆందోళనకు దిగారు. 

టీడీపీ, జనసేన జెండాలతో టెంట్‌ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లకు లక్షలాది మంది తరలివస్తారు. యాత్రికుల కోసం కొండ దిగువన జాతర జరిగే ప్రదేశంలో దుకాణాలు, వినోదం కోసం జెయింట్‌ వీల్‌ వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. తమ భూముల్లో దుకాణాలు పెట్టుకున్నందుకు వ్యాపారుల నుంచి రైతులు కొంత మొత్తాన్ని అద్దె దూరంలో తీసుకుంటారు. 

ఈ మొత్తంలోనే కొంత గ్రామ పంచాయతీకి పన్నుగా చెల్లించేవారు. అయితే.. రెండేళ్లుగా తిరునాళ్లలో నిర్వహించే దుకాణాలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరుడు, తెలుగు యువత నాయకుడు నాగూర్‌మీరా గత ఏడాది దుకాణాదారులు, జెయింట్‌ వీల్‌ నిర్వాహకుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాది కూడా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి జెయింట్‌ వీల్‌ నిర్వాహకులు సామగ్రితో కొండకు చేరుకోగా.. నాగూర్‌మీరా అనుచరులు అడ్డుకోవడంతో రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

‘మా భూముల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే మీకెందుకు డబ్బులివ్వాలి’ అని రైతులు నిలదీశారు. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మాకు డబ్బులు ఇవ్వాల్సిందే’ అని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. దీంతో రైతులంతా ఎమ్మెల్యే చదలవాడను కలిసి గోడు వెళ్లబోసుకోగా.. నాగూర్‌మీరా చెప్పినట్టే చేయాలని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో చేసేదిలేక రైతులంతా కోటప్పకొండకు చేరుకుని జాతర జరిగే స్థలంలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్‌ ఏర్పాటు చేసు­కుని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ‘మేమంతా టీడీపీ, జనసేన అభిమానులమే. టీడీపీ కూటమి విజయం కోసం కృషి చేసిన మాకే ఇలా అన్యాయం చేస్తే ఎలా’ అని ప్రశి్నంచారు.

Advertisement
 
Advertisement
Advertisement