సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ(క్రిస్ సిటీ) మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్‌లో తొలిదశలో 2,134 ఎకరాలకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో సుమారు రూ.1,200 కోట్లతో ఈపీసీ టెండర్లను ఏపీఐఐసీ పిలవనుంది. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపుతున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి జూన్‌లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
రెండేళ్లలో అందుబాటులోకి...
క్రిస్ సిటీ పనులు జూన్‌లో మొదలు పెట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 12,944 ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, 5.15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన జాకబ్ సంస్థ అంచనా వేసింది. 99,400 మంది నివాసం ఉండేలా ఈ పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు. మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్న క్రిస్‌సిటీలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఫైబర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు.
పోర్టుల ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల మాదిరిగా పరిశ్రమలతోపాటు నివాసయోగ్యంగా ఉండేలా ఫ్యూచర్ వర్క్‌లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో క్రిస్ సిటీ బ్రాండింగ్ చేస్తున్నట్లు రవీన్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 13.9 శాతం ఉద్యోగులు అక్కడే నివసించేలా గృహ సముదాయాల నిర్మాణానికి వినియోగిస్తారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయిస్తారు. 10.9 శాతం పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీగా ఉంచుతారు. క్రిస్ సిటీ తొలిదశ ద్వారా సుమారు రూ.18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా వేసింది.
ఎస్పీవీకి భూమి బదలాయింపు..
కృష్ణపట్నం నోడ్ తొలిదశ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపి రూ.2,139.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాటైన ఎస్పీవీకి భూమి బదలాయింపులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభించేందుకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment