సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల స్థూల ఉత్పత్తిలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కృష్ణాజిల్లా మొదటి ర్యాంకు సాధించింది. విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకులో ఉండగా తూర్పుగోదావరి జిల్లా మూడవ స్థానంలో ఉంది. విజయనగరం జిల్లా చివరి 13వ ర్యాంకులో నిలిచింది. జిల్లాల స్థూల ఉత్పత్తికి (ఆదాయాల) సంబంధించిన గణాంకాలను ప్రణాళికా శాఖ ఇటీవల రూపొందించింది.
జిల్లాల ఆదాయ సూచికలు సమతుల్య అభివృద్ధి సాధనకు దోహదపడతాయని ప్రణాళికా శాఖ పేర్కొంది. అలాగే, జిల్లాల మధ్య అసమానతనలు పరిశీలించడంతో పాటు ఆయా జిల్లాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు రూపొందించడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయని ప్రణాళికా శాఖ నివేదికలో వివరించింది. జిల్లాల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి కూడా ఈ స్థూల ఉత్పత్తి గణాంకాలు అవసరమని ప్రణాళికా శాఖ తెలిపింది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ..
మరోవైపు.. ప్రస్తుత ధరల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14.64 శాతంతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా 14.22 శాతంతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా 10.00 శాతంతో మూడోస్థానంలో ఉంది.
అలాగే, పారిశ్రామిక రంగంలో విశాఖ జిల్లా 18.43 శాతంతో మొదటి ర్యాంకులో, 13.82 శాతంతో తూర్పుగోదావరి జిల్లా రెండవ ర్యాంకులో ఉండగా చిత్తూరు జిల్లా 9.33 శాతంతో మూడవ ర్యాంకులో ఉంది. ఇక సేవా రంగంలో 15.69 శాతంతో విశాఖ జిల్లా మొదటి ర్యాంకులో ఉంది. కృష్ణాజిల్లా 14.98 శాతంతో రెండో ర్యాంకులో ఉండగా.. తూర్పుగోదావరిజిల్లా 9.51 శాతంతో మూడో స్థానంలో ఉంది.
జిల్లాల స్థూల ఉత్పత్తిలో ‘కృష్ణా’ ఫస్ట్
Published Tue, Nov 22 2022 4:40 AM | Last Updated on Tue, Nov 22 2022 4:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment