బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కొండలు, గుట్టలు దాటుకుని ప్రవహిస్తూ.. 672 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గలగలమని పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు కాలువ వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు తరలించడంలో విఫలమయ్యారు.
2022 సెప్టెంబర్ 23న కుప్పంలో జరిగిన సభకు హాజరైన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన కుప్పం కాలువ పనులను పూర్తి చేస్తామని, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇస్తే సస్యశ్యామలం అవుతుందని ప్రకటించారు. అన్నట్టుగానే మాట నిలుపుకున్నారు. కృష్ణా జలాలు కుప్పం ఉపకాలువలో ప్రవహిస్తూ బుధవారం ఉదయం 11 గంటలకు రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద (కుప్పం ఉపకాలువ కిలోమీటర్ 64.278 వద్ద) కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. జనం తండోపతండాలుగా తరలివచ్చి ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు.
కృష్ణమ్మకు హారతులు పట్టి ఆహా్వనించారు. శ్రీశైలం నుంచి 27 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ కుప్పానికి తరలిస్తున్నారు. బుధవారానికి శ్రీశైలం నుంచి కుప్పం సరిహద్దు వరకు 672 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ కృష్ణమ్మ కుప్పం నేలను తడిపింది. సముద్ర మట్టానికి 758 మీటర్ల ఎత్తున నీటిని తరలిస్తూ కాలువలోకి ప్రవహింపజేస్తున్నారు. ప్రస్తుతం చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అసంపూర్తి పనులను పూర్తి చేసి..
టీడీపీ హయాంలో 2015లో జరిగిన టెండర్లలో కుప్పం కాలువ పనులను మూడు కాంట్రాక్టు సంస్థల జాయింట్ వెంచర్ 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరందించే పనులు పూర్తి చేయాలి. ఈ పనులను ఇష్టారీతిన నిర్వహించి 2018 నుంచి అసంపూర్తిగా వదిలేశారు. 2019 నుంచి పనులు పూర్తి చేయించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టి కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు.
సీఎం చొరవతో భూ సేకరణకు రూ.40 కోట్లు మంజూరు చేశారు. 4.80 కిలోమీటర్ల పెండింగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టిపని, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ టన్నెల్ పనులు 45 మీటర్లు జరగాల్సి ఉండేది. వీటి పనులు పూర్తి చేయించడమేకాక గత కాంట్రాక్టర్ల పనుల్లో లోపాలను సరిచేయించి కాలువలో నీటి తరలింపునకు ఇబ్బందులు తొలగించడంతో ప్రస్తుతం కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి.
ఎందుకు నీళ్లివ్వలేదు బాబూ!
కుప్పానికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు తన హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 2019 జనవరి 21న ప్రారంభమై ఏప్రిల్ 11 వరకు పుంగనూరు ఉపకాలువలో కృష్ణా జలాలు పారించారు. 82 రోజులు పారించినా పనులు పూర్తి చేయించకపోవడంతో కుప్పం కాలువలోకి నీళ్లు పారలేదు. బాబు పాలనలో వచి్చన కృష్ణా జలాలు 775 ఎంసీఎఫ్‌టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్స్) మాత్రమే.
ఈ నీటిలో 207 కిలోమీటర్ల పుంగనూరు ఉపకాలువ (గడ్డంవారిపల్లె నుంచి బొమ్మరాజుపల్లె వరకు) లో 742.19 ఎంసీఎఫ్‌టీలు, 43 కిలోమీటర్ల కుప్పం కాలువలో 32.81 ఎంసీఎఫ్‌టీల నీరు పారింది. 123 కిలోమీటర్లు మేర ఉండే కుప్పం కాలువలో పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె నుంచి 43వ కిలోమీటర్‌లోని వి.కోట మండలం నారి్నపల్లె వరకు జలాలు సాగి ఆగిపోయాయి. తన పాలనలో కుప్పం కాలువ పనులు పూర్తి చేయించలేకపోయిన చంద్రబాబు.. వైఎస్ జగన్ పనులు చేయించలేదని గగ్గోలు పెట్టారు. అయితే.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనులు పూర్తి చేయించి కుప్పానికి కృష్ణా జలాలు పారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment