కుటుంబాలు 140.. ఉద్యోగులు 114 | Kutagundla Village Have More Government Employees In Prakasam | Sakshi
Sakshi News home page

కుటుంబాలు 140.. ఉద్యోగులు 114

Published Wed, Dec 23 2020 9:39 AM | Last Updated on Wed, Dec 23 2020 12:46 PM

Kutagundla Village Have More Government Employees In Prakasam - Sakshi

కూటాగుండ్ల గ్రామం ఇదే..

భవిత ఉన్నతికి విద్యార్థి దశే కీలకం. ఈ విషయాన్ని హనుమంతునిపాడు మండలంలోని కూటాగుండ్ల గ్రామం బాగా తెలుసుకుంది.  అందుకే నాడు కూలీలతో  నిండిపోయిన గ్రామం నేడు  వందలమంది ఉద్యోగులతో  కళకళలాడుతోంది. వీరు ఈ ఘనత సాధించడానికి తల్లిదండ్రుల  సహకారం, గురువుల స్ఫూర్తి, విద్యార్థుల పట్టుదలే కారణాలుగా నిలిచాయి.

సాక్షి, హనుమంతునిపాడు: పిల్లలు తమలా కష్టపడకూడదనే ఒక్క ఆలోచనతో మండలంలోని కూటాగుండ్ల గ్రామస్తులు ఒక్కటయ్యారు. కూలీ పనులు చేశారు.. కష్టపడి పంటలు పండించుకున్నారు. ఎలాగో సంపాదించి తమ పిల్లల చదువుల కోసం ఖర్చు చేశారు. ఇలా వారి సంకల్పం ఎదిగి ఇప్పుడు పిల్లలంతా ఉద్యోగాల్లో స్థిర పడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా నేటి చరిత్ర. గతంలో ఈ గ్రామంలో చదువుకున్న వారు ఐదారుగురు మాత్రమే ఉండగా ఇప్పుడు దాదాపు అంతా అక్షరాస్యులుగా మారారు. చదవండి: ఒక పోస్టుకు 32 మందే పోటీ..  

గ్రామంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాలో వీరందరికీ విద్యా బీజాలు వేసి వారి ఉన్నతికి ప్రథాన కారణంగా నుంచుంది. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామంలోనే విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఆ తర్వాత పై చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లి తమ తల్లిదండ్రుల కలలు సాకారం చేయడంలో సఫలం చెందారు.   

గురువుల స్ఫూర్తితో.. 
‘మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూస్తున్నారు. మీరు అలా కాకూడదు. బాగా చదువుకుంటేనే ఉన్నత స్థానం వస్తుంది’ అంటూ విద్యార్థుల్లో వారి గురువులు ఉత్సాహాన్ని నింపడంతో చిన్నతనం నుంచే విద్యపై మక్కువ పెంచుకున్నారు. వారి సలహాలతో విద్యార్థులు పోటీపడి చదివేవారు. ఇలా ఎక్కువ మంది విద్యార్థులు చేరడంతో స్కూల్‌ను 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఆ తర్వాత గ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న సీతారాంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. అప్పటి వరకు నేర్చుకున్న క్రమశిక్షణే వారి ఉద్యోగ సాధనకు పనికి వచ్చింది. తమ ఇష్టం వచ్చిన కోర్సులను ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో చదువు కోవడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే కేవలం విద్యార్థులే కాకుండా.. విద్యారి్థనులు కూడా వారితో పోటీ పడటం నేర్చుకున్నారు. ప్రస్తుతం దాదాపు 20 మంది మహిళలు బీటెక్, ఎంటెక్, ఎంబీలు పూర్తి చేయగలిగారు.  

ఉద్యోగాల ఖిల్లా 
విద్యార్థుల శ్రమకు తోడు.. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో నేడు ఈ గ్రామం ఉద్యోగాల ఖిల్లాగా మారింది. ఇప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నత చదువులు చదివి వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 80 కుటుంబాలు, ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలుండగా 500 మంది జనాభా ఉన్నారు. అయితే వీరిలో ఏకంగా 114 మంది ఉద్యోగులుండటం గమనార్హం. వీరిలో ఉధ్యాయులు, ఇంజినీయర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. 10, ఇంటర్‌ చదివిన వారు మాత్రం పోలీస్, ఆర్మీ ఉద్యోగాలు సా«ధించారు. ఎస్సీ కాలనీలో ఎక్కువ మంది బిలాయి, చెన్నై, చతీష్‌ఘడ్‌ ,మధ్య ప్రదేశ్, కూర్బా, ముంబయి వంటి ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. వీరంతా పండగలు, శుభకార్యాలకు గ్రామం వచ్చినప్పుడు సందడి వాతావరణం నెలకొంటుంది. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ పాత సంగతులు గుర్తు చేసుకుంటుంటారు. ఆరాధ్య దైవం అయిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లకు వచ్చి మొక్కలు తీర్చుకొని వెళ్తుంటారు.

 హోం టు డెస్క్‌ 
గ్రామంలో అత్యధికంగా 35 మందికి పైగా బెంగళూరు, హైదరాబాదు, ముంబై ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. గ్రామంలో ఉన్న 80 కుటుంబాలకు గాను   రెండు మూడు కుటుంబాలు మినహా ప్రతి ఇంట్లో  ఉద్యోగులున్నారు. చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇంకా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో గత ఏడు నెలల నుంచి గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే సేవలు     అందిస్తున్నారు.

ఉన్నత చదువుల వల్లే
ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గ్రామానికి చెందిన ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివారు. అందుకే మంచి ఉద్యోగాలు సాధించారు. ప్రతి ఇంటిలో ఇద్దరు, ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లున్నారు.  
 దేవిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, ఉపాధ్యాయుడు

అమ్మా, నాన్న ప్రోత్సాహంతో
చిన్నతనం నుంచి మా అమ్మ నాన్న, గురువు వెంకటేశ్వరెడ్డి ప్రోత్సాహంతో కష్టపడి బీటెక్‌ చదివాను. వ్యవసాయం చేసి నన్ను, తమ్ముడిని బీటెక్‌ చదివించారు. వారి కష్టానికి ఫలితంగా బెంగళూరులో టెక్‌ మహేంద్ర ప్రైవేటు లిమిటెడ్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నా. పావులూరి ప్రసాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

సంతోషంగా ఉంది
అందరి సహకారంతో కష్టపడి బీటెక్‌ వరకు చదివాను. ప్రస్తుతం బెంగళూరులో టీసీఎం ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కరోనా కావడంతో ప్రస్తుతం ఇంటి నుంచే  సేవలు అందిస్తున్నా. -పి.తరుణ్‌ 

ఉన్నత విద్య సాకారం
నన్ను, అన్నను, చెల్లిని అమ్మానాన్నలు బీటెక్‌ వరకు చదివించారు. అమ్మనానతో పాటు మాటీచర్‌ వెంకటేశ్వరెడ్డి స్ఫూర్తిగా నిలవడంతో అన్న రవితేజ మద్రాసులో ఇన్‌కంట్యాక్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. చెల్లి ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తోంది. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నా.
-దేవిరెడ్డి విద్యాసాగర్‌ 

డెల్‌ కంపెనీలో
మా స్నేహితులతో కలిసి డెల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా. అమ్మ నాన్న కూలీ పనులు చేసి నన్ను చదివించారు. ఇప్పుడు జీవితం హాయిగా ఉంది. -కొత్తపల్లి సుదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement